గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 22 జనవరి 2017 (07:47 IST)

చింతచచ్చినా పులుపు చావని కాంగ్రెస్‌: అఖిలేష్ ముందు కుప్పిగంతులు

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఏదయితే జరగకూడదనుకున్నారో అదే జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడుతున్న ఛాయలు ఆదిలోనే వీగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రవృత్తి. తాను జాతీయ పార్టీగానే భావించుకుంటూ ప్రాంతీయ

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఏదయితే జరగకూడదనుకున్నారో అదే జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడుతున్న ఛాయలు ఆదిలోనే  వీగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రవృత్తి. తాను జాతీయ పార్టీగానే భావించుకుంటూ ప్రాంతీయ ప్లేయర్‌ స్థాయిని చలాయించుకోవాలనే కాంగ్రెస్ పార్టీ వైఖరే యూపీలో పొత్తుకు నెర్రెలు చీలే పరిస్థితిని తీసుకువస్తోంది. ముఖ్యంగా చర్చల బల్ల వద్ద యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్థాయిని, శక్తిని అంచనా వేయడంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ పూర్తిగా తప్పుగా అంచనా వేసినందునే పొత్తు ఆశలు విఫలమవుతున్నాయని నిపుణుల అంచనా.
 
సొంత పార్టీలోనూ, కుటుంబంలోనూ భీకర పోరులో గెలుపొంది ఉత్సాహంతో ఉరకలేస్తున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పొత్తు విషయంలో రాహుల్, ప్రియాంక గాంధీలు వ్యవహరించిన తీరునే తప్పుపడుతున్నట్లు సమాచారం. పొత్తు విషయంలో ప్రాథమిక చర్చలకు కాంగ్రెస్ సీనియర్లను పంపకుండా కాంగ్రెస్ వ్యవస్థలో ఏమాత్రం పాత్రలేని ప్రశాంత్ కిషోర్, మాజీ ఐఏఎస్ అధికారి ధీరజ్ శ్రీవాత్సవ వంటి రాజకీయ సత్తాలనే అనామకులను పంపడం అఖిలేష్‌ను దిగ్భ్రాంతి పర్చిందని సమాచారం. చివరకు పార్టీ అత్యున్నత కమిటీ అయిన కాంగ్రెస్ కార్యాచరణ కమిటి సభ్యుడిని కూడా పొత్తు చర్చలకు పంపకపోవడం అఖిలేష్‌కి చిర్రెత్తుకొచ్చిందని తెలుస్తోంది.
 
శనివారం మధ్యాహ్నం 1 గంటకు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌కి ప్రియాంక గాంధీనుంచి కాల్ వచ్చినట్లు అఖిలేష్ సన్నిహితుడు ఒకరు చెప్పారు. ఆ సమయంలో అఖిలేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తన భార్య ఫోన్ ద్వారానే అఖిలేష్ ప్రియాంకతో మాట్లాడారట. కాంగ్రెస్ తరపున పంపిన ప్రతినిధులతో తాను చర్చిస్తానని అఖిలేష్ ఆమెకు మాట ఇచ్చారట. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను పంపుతారనుకుంటే ప్రియాంక గాంధీ ప్రశాంత్ కుమార్‌ను ఎంపిక చేసి పంపినట్లు సమాచారం. 
 
ఉత్తర ప్రదేశ్ రాజకీయ పటంలో ఇప్పుడు అఖిలేష్ చాలా శక్తిమంతుడు. దీన్ని అర్థం చేసుకోని కాంగ్రెస్ పార్టీ యధాలాపంగా తన నిర్లక్ష్య ధోరణిని, చిత్తశుద్ది రాహిత్యాన్ని ప్రదర్శించిందని సీనియర్ ఎస్పీ నేత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
 
వాస్తవానికి చర్చలకోసం స్వయంగా రాహుల్ గాంధీనే ఆగ్రాకు లేదా లక్నోకు వస్తారని అఖిలేష్ భావించారట. రాహుల్ వస్తే గురువారం లేదా శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుని సంయుక్త ప్రకటన కూడా చేయవచ్చని అఖిలేష్ ఆలోచన. కాని కాంగ్రెస్ ఎప్పటిలాగే నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడంతో అఖిలేష్ దానిలో ఢిల్లీవాలా ప్రవృత్తిని చూసినట్లు సమాచారం. 
 
పైగా సీట్ల కోసం చర్చల్లో కాంగ్రెస్ పార్టీ మరీ అత్యాశకు పోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తనకు 140 స్థానాలు కావాలని కోరితే అఖిలేష్ 72 సీట్లు మాత్రమే ఇస్తాననన్నారట. ఓట్లపరంగా కాంగ్రెస్ చాలా బలహీనమైన వికెట్టని అఖిలేష్ ఆలోచన. బ్రాహ్మణ ఓటు, ముస్లింలకు సంఘీభావం ప్రకటిస్తానన్న సంకేతం ఇవి రెండే కాంగ్రెస్‌కు యూపీలో కాస్త ప్రాతిపదికను కల్పించే అంశాలని అఖిలేష్ భావన. చివరకు చర్చలు తుదిదశకు వచ్చేసరికి అఖిలేష్ చివరాఖరికి 91 స్థానాలు కట్టబెడతానని చెప్పేశారు. ఎస్పీకి సంబంధించిన 25 స్థానాల్లో కూడా కాంగ్రెస్ గుర్తుతో పోటీ చేసేందుకు అఖిలేష్ ఒప్పుకున్నారని సమాచారం.

ఇక డీల్ ఫైనల్ చేయాలని అఖిలేష్  కాంగ్రెస్‌కు 99 స్థానాలు ఇస్తానని ఆపర్ చేయగా కాంగ్రెస్ దానికీ పేచీ పెట్టిందని తెలిసింది. దీంతో శనివారం చర్చలు బెడిసికొట్టాయి. ఢిల్లీలో శనివారం జరిగిన చర్చల్లో రాహుల్, ప్రియాంక గాంధీలు పార్టీలోని వృద్ధ నేతల సలహా తీసుకుని ఆదివారం 11 గంటలకు చర్చలను కొలిక్కి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. కానీ కాంగ్రెస్ అనేక అభద్రతలతో కొట్టుమిట్టాడుతోందని సమాజ్ వాదీ పంటను కోసుకోవాలని భావిస్తూనే రాహుల్ మరోవైపు అఖిలేష్‌కు దూరంగా ఉండాలని తలుస్తున్నారంటూ ఎస్పీ నేత ఒకరు విమర్శించారు.
 
జాతీయ స్థాయి కూడా లేని కాంగ్రెస్ పార్టీ మరోవైపు ప్రాంతీయ శక్తిగా రాజకీయ క్రీడ సల్పాలని భావించడంలోనే అసలు సమస్య దాగినట్లు తెలుస్తోంది.