గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (16:51 IST)

నేను అచ్చమైన భారతీయుడిని... మేం దేశం విడిచి ఎలా వెళతాం... అమీర్ ఖాన్

గత 24 గంటలుగా అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై జరుగుతున్న రచ్చపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్పందించారు. తన వ్యాఖ్యలపైన వివరణ కూడా ఇచ్చుకున్నారు. తనకు గానీ, తన భార్యకు గానీ భారతదేశం విడిచి వెళ్లిపోవాలన్న ఉద్దేశ్యం లేదన్నారు. ఆమె అనుకున్న విషయాన్ని మాత్రమే తను చెప్పాననీ, అంతేతప్ప వెళ్లిపోతామని చెప్పలేదన్నారు. 
 
ఇకపోతే తను భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నానని అన్నారు. ఇంకా అమీర్ మాట్లాడుతూ... నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను. నేను ఎక్కడికీ వెళ్లను. నేను అచ్చమైన భారతీయుడిని. ఈ విషయంలో నాకెవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేశంలో పౌరుల మధ్య సోదరభావాన్ని కాపాడాల్సిన అవసరముంది అని చెప్పారు.
 
అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యలపై దేశంలో సెలబ్రిటీలు, సామాన్యులు, నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. తాజాగా సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఈ వ్యవహారంపై మాట్లాడారు. అమీర్ ఖాన్ సున్నితమైన విషయాన్ని బయటకు చెప్పారంటే ఎక్కడో ఏదో ఆయనను బాధ పెట్టిన ఘటన జరిగి ఉంటుంది. 
 
అసలీ విషయంపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండకుండా ఆయనతో మాట్లాడి అసలు విషయమేమిటో తెలుసుకోవాలి. స్వతంత్ర భారతదేశంలో ఎవరి మనసులో ఏమున్నా నిర్భయంగా చెప్పే హక్కు ఉన్నది. అలాగే అమీర్ ఖాన్ తన భార్య ఏమనుకుంటున్నారో బయటి లోకానికి వెల్లడించారు. అందులో తప్పేముంది... ఐతే వారలా అనుకోవడానికి వెనుక ఉన్న కారణమేమిటో ప్రభుత్వం తెలుసుకోవాలని ములాయం సింగ్ యాదవ్ సూచించారు. మరి ప్రభుత్వం అమీర్ ఖాన్‌ను పిలిపించి ఆయనలా ఎందుకు అనాల్సి వచ్చిందో అడిగి తెలుసుకుంటుందా... చూడాల్సి ఉంది.