గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 21 మే 2015 (14:12 IST)

నరేంద్ర మోడీ యేడాది పాలనకు -0 మార్కులే : లాలూ ప్రసాద్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి యేడాది పాలనపై మైనస్ సున్నా మార్కులు వేస్తానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఈ యేడాది కాలంలో నరేంద్ర మోడీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా.. రైతులను ఆదుకోవడంలోనూ, యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైందన్నారు.
 
ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి తానైతే సున్నా కంటే తక్కువ మార్కులు ఇస్తానన్నారు. దేశంలో పంట నష్టపోయిన బాధిత రైతులకు సహాయం చేయడం, యువతకు ఉద్యోగం కల్పించడంలో విఫలమయ్యారన్నారు. అంతేగాక విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకుని రావడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. 
 
జనతా పరివార్‌లో ఆరు పార్టీల విలీనంపై ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, జేడీయూ అధినేత శరద్ యాదవ్‌తో సమావేశమయ్యేందుకు ఢిల్లీ వెళుతున్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఎయిర్‌‍పోర్టులో మీడియాతో పైవిధంగా మాట్లాడారు. 
 
కాగా, ఇటీవల మోడీ యేడాది పాలనపై స్పందించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మోడీ పాలనకు తాను పదికి సున్నా మార్కులే ఇస్తానంటూ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తమ సర్కారుకు మార్కులు ఇవ్వడానికి ఆయన ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.