బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : మంగళవారం, 24 మార్చి 2015 (21:40 IST)

డికె రవి వన్ సైడ్ లవ్ ఎఫైర్... ఏపీకి బదలీ కోసం మహిళా ఐఏఎస్ యత్నిస్తున్నారా...?

బెంగళూరులో గత వారం అనుమానస్పద రీతిలో మృతి చెందిన డికె రవి కేసులో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తొలుత ఇదేదో మాఫియా ఓ ప్రణాళిక ప్రకారం హత్య చేసి ఉంటారని అనుకున్నారు కానీ అది ఆత్మహత్యేనని కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కానీ సీబీఐ దర్యాప్తు డిమాండ్ రావడంతో కర్నాటక ప్రభుత్వం దానికి తలొగ్గి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నది. ఐతే ఈ కేసులో కొత్తకొత్త మలుపులు కనబడుతున్నాయి. 
 
డి.కె రవి మృతికి మహిళా ఐఎఎస్ రోహిణితో వన్ సైడ్ లవ్ ఎఫైర్ కారణమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2009 బ్యాచ్ లో డి.కె రవి 34వ ర్యాంకును కలిగి ఉంటే ఏపీ నుంచి 43వ ర్యాంకును సాధించారు రోహిణి. అలా ఇద్దరూ మిస్సౌరిలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. కాగా రోహిణి అనుకోకుండా కర్నాటక క్యాడర్‌లో సెలక్ట్ అయి తుమ్కూరులో పోస్టింగ్ చేయడం జరిగింది. 
 
ఆ తర్వాత వృత్తిపరంగా వారిరువురు మాట్లాడుకునేవారని తెలుస్తోంది. ఐతే అదే ఆ తర్వాతి కాలంలో సమస్యలను తెచ్చిందనే వాదన వినబడుతోంది. ఈ లోపు రోహిణీ ఓ రియల్టర్ ను వివాహం చేసుకుంటే, రవి ఓ కాంగ్రెస్ నాయకుడు కుమార్తెను పెళ్లాడారు. కానీ ఆ తర్వాత రోహిణిని రవి ఫోనులో వేధించేవారనీ, దాంతో అతడి వేధింపులు తట్టుకోలేక ఈ విషయాన్ని సీఎస్‌కు కూడా నివేదించినట్లు వార్తలు వచ్చాయి. 
 
ఏదేమైనప్పటికీ చివరి రోజున అతడు సుమారు 44 ఫోన్ కాల్స్ చేశారనీ, అంతకుముందు రోజు కనీసం 30 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్లు కాల్ రికార్డ్ ను బట్టి తెలుస్తోందని విశ్వసనీయ సమాచారం. చివరిరోజున అతడి వద్ద నుంచి వేధింపు కాల్స్ ఎక్కువయ్యేసరికి ఆమె తన ఫోనును భర్తకు ఇచ్చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా రవి ఆత్మహత్యకు పాల్పడే కొద్ది నిమిషాలకు ముందు ఓ టెక్ట్స్ మెసేజ్ పంపారనీ, అది సూసైడ్ నోట్ గా పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా విచారణ పూర్తయ్యేవరకూ మధ్యంతర నివేదికలను వెల్లడి చేయవద్దని మహిళా ఐఏఎస్ అధికారి భర్త దాఖలు చేసిన పిటీషన్ సందర్భంగా విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా డీకె రవి వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే విధంగా కుట్ర జరుగుతోందని అక్కడి విపక్ష రాజకీయ నాయకులు ఆందోళన చేస్తున్న నేపధ్యంలోనూ, తన రక్షణ విషయంలోనూ మహిళా ఐఏఎస్ అధికారి ఏపీకి బదలీ చేయించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తమ్మీద డీకే రవి వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్పై సీఐడీ, కోర్టు వాదనలను రవి కుటుంబ సభ్యులు కొట్టి పారేస్తున్నారు. తమ కుమారుడు నిజాయితీకి మారుపేరు అంటున్నారు. మరి సీబీఐ విచారణలో ఏమి తేలుతుందో వేచి చూడాల్సిందే.