శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 20 జనవరి 2016 (17:30 IST)

నేను సన్యాసినయ్యేందుకు వెళ్తున్నా... వెతకొద్దు... ఐఐటి మద్రాసు విద్యార్థిని(గుంటూరు) లేఖ షాక్

మేధావులుగా మంచి టాప్ ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థినీవిద్యార్థులు ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడికి గురై గబుక్కున ఓ నిర్ణయం తీసేసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు తమ తల్లిదండ్రులకు ఎంతటి ఆవేదనకు గురి చేస్తాయో ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. వారేమి అనుకుంటారో అదే చేసేస్తున్నారు. తాజాగా మద్రాస్ ఐఐటీలో జరిగిన ఘటన మిస్టరీగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాకు చెందిన 26 ఏళ్ల వేదాంతం ఎల్.ప్రత్యూష ఐఐటి మద్రాస్‌లో ఇంజినీరింగ్ డిజైన్లో ఎమ్ఎస్ చేస్తోంది. మరి చదువు తెచ్చిన ఒత్తిడో ఏమోగానీ ఆమె ఓ నిర్ణయం తీసేసుకుంది. తనకు సన్యాసిని కావాలన్న ఆకాంక్ష బలపడిపోయిందనీ, అందువల్ల హిమాలయాలకు వెళుతున్నట్లు తను ఉంటున్న హాస్టల్ గదిలో ఒక లేఖను రాసి పెట్టి వెళ్లిపోయింది.
 
తనకెందుకో ఈమధ్య ఆధ్యాత్మిక జీవనం పైన విపరీతమైన ప్రేమ ఏర్పడిందనీ, అందువల్ల హిమాలయాలకు వెళ్లిపోతున్నట్లు ఆ లేఖలో తెలిపింది. గత ఆదివారం నాడు ఆమె హాస్టల్ విడిచి వెళ్లిపోయింది. తన కుటుంబ సభ్యుల సహా ఎవరూ తనకోసం వెతకవద్దనీ, ఒకవేళ వెతికినా తను కనబడనని పేర్కొంది. 
 
ఐతే ఆమె ఇప్పటివరకూ ఎక్కడికి వెళ్లిందో తెలియరాక, గుంటూరులో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఆమె నిజంగానే హిమాలయాలకు వెళ్లిందా... లేదంటే ఏమయినా అనుకోని సంఘటన జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.