బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 31 మార్చి 2015 (19:40 IST)

హెల్ప్... హెల్ప్... మా భార్యల నుంచి మమ్మల్ని రక్షించండి... గుజరాత్ భర్తల ఆక్రందన

సీన్ రివర్సయిందా...? భార్యలను భర్తలు వేధించడం మనం చూస్తుంటాం... వింటూ ఉంటాం. ఇదిప్పుడు తిరిగబడిందా... గుజరాత్ రాష్ట్రంలో అదే జరుగుతోందట. గుజరాత్ ప్రభుత్వం మహిళలను గృహ హింస, ఈవ్ టీజింగ్ నుంచి రక్షించేందుకు అభయ అనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి దీనికి 181 కేటాయించింది. కానీ ఈ నెంబరుకు మహిళలే కాదు... పురుషులు కూడా తమను రక్షించాలంటూ కాల్స్ చేస్తున్నారట. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారట. 

 
వివరాల్లోకి వెళితే... తమ భార్యలు చట్టాలను ఆసరాగా చేసుకుని తమను వేధిస్తున్నారనీ, ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారట. తమ భార్యలు తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనీ, తమకు అత్తపోరు ఎక్కువయి పోయిందని వాపోతున్నారట. కాగా ఈ హెల్ప్ లైనుకు వచ్చిన మొత్తం కాల్స్ గత సెప్టెంబరు నుంచి మొన్నటి ఫిబ్రవరి దాకా చూస్తే 7919 కాల్స్ లో పురుషులు చేసినవి 2201 అని తేలిందట. భార్యా బాధితులు గుజరాత్ ప్రభుత్వం తెచ్చిన చట్టంతో విలవిలలాడుతున్నట్లు ఈ కాల్స్ తేటతెల్లం చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.