శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (07:27 IST)

ఇంటి అద్దెల రసీదుల్లో దొంగ లెక్కలు చూపుతున్నారా.,. ఇక మీపని గోవిందా..

ఆదాయపన్ను శాఖ దేనిమీదైనా పడొచ్చు కానీ ఇంటి అద్దెల రసీదులపై కన్ను వేయదని మనలో చాలామందికి మహానమ్మకం. ఆ నమ్మకం తోటే దశాబ్దాలుగా మనం చెల్లిస్తున్న ఇంటి అద్దె ఒకటయితే దానికి రెట్టింపు బిల్లులను రసీదుల్లో రాసి మనమే ఇంటి ఓనర్ సంతకం పెట్టి లేదా మనకు తెలిసిన

ఆదాయపన్ను శాఖ దేనిమీదైనా పడొచ్చు కానీ ఇంటి అద్దెల రసీదులపై కన్ను వేయదని మనలో చాలామందికి మహానమ్మకం. ఆ నమ్మకం తోటే దశాబ్దాలుగా మనం చెల్లిస్తున్న ఇంటి అద్దె ఒకటయితే దానికి రెట్టింపు బిల్లులను రసీదుల్లో రాసి మనమే ఇంటి ఓనర్  సంతకం పెట్టి లేదా మనకు తెలిసిన వారిచేత ఓనర్ సంతకం పెట్టి ఆఫీసుల్లో ఐటీ శాఖల వారికి చూపించి ఆదాయ పన్ను కట్టనవసరం లేకుండా తప్పించేసుకుంటున్నాం కదూ..
 
ఇకపై ఈ ఆటలు సాగవంటోంది ఆదాయ శాఖ. ఎందుకంటే ఆదాయ పన్ను మినహాయింపు పొందడం కోసం చాలామంది తప్పు లెక్కలతో, పెంచిన లెక్కలతో దొంగ రసీదులు సమర్పిస్తున్నట్లు ఐటీ విభాగం గుర్తించింది. ఇది రెండు రకాలుగా సాగుతున్నట్లు వారి దృష్టికి వచ్చింది. 1. తక్కువ అద్దె చెల్లిస్తూ ఎక్కువ ఇస్తున్నట్లు రసీదులు జత చేయడం. ఇది ఉద్యోగుల్లో చాలామందికి అలవాటైన పనే. 2. సొంత ఇంట్లో ఉంటూనే తల్లిదండ్రులకు, బంధువులకు అద్దె ఇస్తున్నట్లు కొంతమంది పత్రాలు ఇవ్వడం చేస్తున్నారు. 
 
ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే ఇంటి అద్దె భత్యంలో దాదాపు 60 శాతంమేరకు ఉద్యోగులు పన్ను మినహాయింపు పొందుతున్నట్లు ప్రభుత్వం కనిపెట్టేసింది. ఇక నుంచి దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆదాయ శాఖ పకడ్బందీగా కసరత్తు చేస్తోంది. దీంట్లో భాగంగానే ఐటీ అధికారులకు అనుమానం వస్తే పన్ను చెల్లింపుదారు నుంచి అద్దెకు సంబంధించి ఆధారాలు కోరవచ్చని ఆదాయ పన్ను ట్రైబ్యునల్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అధికారులు అడిగితే అద్దె ఒప్పంద పత్రం, విద్యుత్తు బిల్లు, కొళాయి బిల్లు హౌసింగ్ సొసైటీకి రాసిన లేఖ వంటివి ఆధారాలుగా చూపాలని అధికారులు కోరవచ్చు.
 
ఇవి కాక ఇంకో భారం ఉద్యోగులపై, అద్దె ఇంట్లో ఉన్నవారిపై పడనుంది. మన దేశంలో ఉద్యోగాలు చేస్తూ, చట్టం గురించిన వివరాలు క్షుణ్ణంగా తెలిసినవారు అద్దె ఇళ్ల యజమానులయితే వారు తప్పనిసరిగా అద్దె ఒప్పందం, మనం చెల్లిస్తున్న అద్దె వివరాలు వంటివి రాతపూర్వకంగా రాసి రసీదు మనకు ఇస్తారు. కొంతమంది ఉద్యోగులైన గృహ యజమానులు ఇలా చేయలేదనుకోండి. ఇకపై ప్రతి గృహయజమానీ తన ఇంట్లో అద్దెకుంటున్న వారితో అద్దె ఒప్పందం కుదుర్చుకుని ఆ పత్రాన్ని భద్రంగా ఉంచుకోవడం అవసరం అవుతుంది.
 
సంవత్సరానికి లక్ష రూపాయల లోపు అద్దె చెల్లించేవారు ఇంటి ఓనర్ పాన్ కార్డు కాపీని మన ఆదాయ రిటర్న్ పత్రానికి జత చేయనవసరం లేదని ఇంతవరకూ మినహాయింపు ఉండేది. దీన్ని ఉపయోగించుకుని ఉద్యోగుల్లో చాలామంది తాము చెల్లించే అద్దె నెలకు 5 లేదా 6 వేల రూపాయలే అయినప్పటికీ పన్ను మినహాయింపు కోసం నెలకు 8 వేల పైబడి చెల్లిస్తున్నట్లు హౌస్  రెంట్ రిసిప్టును తయారు చేసుకుని ఆదాయ శాఖకు సమర్పించేవారు. లేదా ఆఫీసుల్లో సంబంధిత పనులు తమ తరపున చేసే విభాగానికి ఇచ్చేవారు. అలా ప్రభుత్వానికి పైసా పన్ను కట్టనవసరం లేకుండా జాగ్రత్తపడేవారు. 
 
ఇప్పటి నుంచి ఈ ఆటలు సాగవు. ఇంటి ఓనర్‌తో కుదుర్చుకున్న ఒప్పంద పత్రం తప్పనిసరిగా ఇవ్వాలని ఆదాయ శాఖ నిబంధన చేర్చిందంటే ఉద్యోగులు తప్పు రసీదుల ద్వారా పన్ను మినహాయింపు పొందే అవకాశానికి పూర్తిగా తలుపులు మూసుకున్నట్లే. ప్రధాని మోదీ ఎంత పకడ్బందీగా పన్ను ఎగవేత దారులపై కొరడా ఝళిపిస్తున్నాడంటే అది ఇప్పుడు మన అద్దె ఇంటి తలుపులు తట్టేవరకూ వచ్చింది. ఆ కొరడా దెబ్బ కలిగించే స్వీట్ పెయిన్ భరిద్దామా లేక అసలు కొరడా మన వద్దకు రాకుండానే బుద్ది మార్గం అవలంబిద్దామా.. అంతా మనిష్టమే. ఇక వేరే మార్గం లేదు. మరి. 
 
అలాగే ప్రభుత్వంవారు ఒకే చోట పది ఇళ్లు కట్టి తొమ్మిది ఇళ్లు అద్దెకిచ్చి పైసా పన్ను కట్టకుండా తప్పించుకుంటున్న ఇంటి యజమానులను లేదా గృహ పెట్టుబడిదారులను కూడా ఒక కంట కనిపెడితే మరింత ఆదాయం కళ్ల చూడవచ్చు. ఎందుకంటే దేశమంతా ఇంటి యజమానులు ఇప్పుడు చేస్తున్న పని ఇదే.