గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (09:03 IST)

పాకిస్థాన్‌తో సమీప భవిష్యత్‌లో యుద్ధం తప్పదా?.. దల్బీర్ సింగ్ ఏమన్నారు?

భారత్ - పాకిస్థాన్ దేశాలు సమరానికి కాలుదువ్వుతున్నాయా? అలాంటి పరిస్థితులు ఇరు దేశాల్లో నెలకొన్నాయా? అంటే భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ మాత్రం అవుననే అంటున్నారు. నిజానికి భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో నిరంతరం ఓ మినీ యుద్ధమే సాగుతోంది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి పెరిగిన చొరబాట్ల కారణంగా సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. దీంతో భారత సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. 
 
ఈ పరిస్థితులపై ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ స్పందిస్తూ పాకిస్థాన్‌తో స్వల్పకాలిక, మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో 1965నాటి భారత్‌-పాక్‌ యుద్ధంపై నిర్వహించిన త్రివిధ దళాల కీలక సిబ్బంది సదస్సులో ఆయన పైవిధంగా స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల నిరంతర చొరబాటు యత్నాలు, వారికి దన్నుగా పాక్‌ కవ్వింపు కాల్పులు పెరిగాయన్నారు. ఈ పరిస్థితుల నడుమ భవిష్యత్ యుద్ధాలు హెచ్చరికలకు పెద్దగా వ్యవధి ఉండని, స్వల్పకాలిక, మెరుపుదాడుల రూపంలో ఉంటాయన్నారు.