శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (13:40 IST)

ప్రఖ్యాత యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ ఇకలేరు!

దేశంలో ప్రఖ్యాత యోగా గురువు, అయ్యంగార్ యోగా విధానాన్ని ఆవిష్కరించిన ప్రముఖ యోగా గురువు పద్మవిభూషణ్ బీకేఎస్ అయ్యంగార్ బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన పూణెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయ్ససు 95 యేళ్లు. 
 
అయ్యంగార్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడతూ వచ్చారు. ఆ సమస్యతోనే ఆయనను పూణెలోని ఆస్పత్రిలో చేర్చారు. దీనికితోడు మూత్రపిండాలు కూడా విఫలం కావడంతో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. బీకేఎస్ అయ్యంగార్ యోగా గురువుగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, ఈ సంవత్సరంలో పద్మ విభూషణ్ సత్కారాలు పొందారు. 
 
యోగా గురించి ఆయన అనేక గ్రంథాలు రాశారు. 95 ఏళ్ళ వృద్ధాప్యంలో కూడా ఆయన యోగాసనాలు వేసేవారు. అయ్యంగార్ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అయ్యంగార్ అభిమానులకు సంతాపం తెలిపారు. అయ్యంగార్ సేవలు కొన్ని తరాల పాటు గుర్తుండిపోతాయని, ప్రపంచంలోని చాలామందికి ఆయన యోగాను పరిచయం చేశారని ఆయన అన్నారు.