శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (11:22 IST)

'నీ టీనేజ్ కూతుర్ని చంపి ఉండకపోతే... మనవళ్లు గిఫ్ట్‌గా వచ్చేవాళ్లు' అన్న ట్వీట్‌కు ఇంద్రాణి లైక్...

షీనా బోరా హత్య కేసులో దాగివున్న మిస్టరీని ముంబై పోలీసులు చేధించారు. ఈ హత్యను షీనా తల్లి ఇంద్రాణి, ఆమె కారు డ్రైవర్ శ్యామ్ రాయ్, రెండో మాజీ భర్త సంజీవ్ ఖన్నాలు హత్య చేసినట్టు నిర్ధారించారు. దీనికి సంబంధించి బలమైన ఆధారాలను కూడా ముంబై పోలీసులు సేకరించారు. 
 
ముఖ్యంగా షీనా హత్య అనంతరం ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ ఖన్నా సామాజిక మాధ్యమాల్లో చేసిన ట్వీట్లను ముంబై పోలీసులు గుర్తించారు. ఇలాంటి ట్వీట్లకు ఇంద్రాణి 'లైక్'లు కొట్టింది. ఇలాంటి వాటిలో "నీ టీనేజ్ కూతుర్ని నువ్వు గొంతు నులిమి చంపి ఉండకపోతే... మనవళ్లు బహుమతిగా లభించేవారు" అంటూ 2014లో ఖన్నా చేసిన పోస్ట్‌కు ఇంద్రాణి లైక్ కొట్టారు. 
 
ఆపై "నువ్వు ఎవరినైనా మోసం చేశావంటే, అతను తెలివిలేనివాడని కాదు, నీ అర్హతకు మించి నిన్ను విశ్వసించాడని భావించు" అన్న మరో పోస్టుకు కూడా ఇంద్రాణి లైక్ కొట్టింది. ఇలాంటి ట్వీట్‌లు ఇంద్రాణి లైక్‌లు కొట్టింది. వీటన్నింటినీ పోలీసులు సేకరించారు. 
 
అంతేకాకుండా, తన కారు డ్రైవర్ శ్యామ్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నాల సహకారంతో ఇంద్రాణి దగ్గరుండి తన కూతురిని హత్య చేయించిందని, అంతకుముందే ముంబై సమీపంలోని అడవుల్లో ఎక్కడ తగులబెట్టాలన్న విషయమై రెక్కీ జరిపిందని ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా వెల్లడించారు. ఇంద్రాణిని, ఖన్నాను, శ్యామ్‌ను ఎదురెదురుగా కూర్చోబెట్టి సుదీర్ఘంగా విచారించగా ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి. 
 
దీంతో ఐపీసీలోని 364 (అపహరణ), 302 (హత్య), 201 (సాక్ష్యాల ధ్వంసం) తదితర సెక్షన్ల కింద ఆ ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. అయితే, ఇది కేవలం పరువు హత్యా? లేక ఆర్థిక కారణాలు ఉన్నాయా? షీనా హత్యకు దారితీసిన అసలు కారణం ఏమిటి? అన్న విషయమై విచారణ జరపాల్సి వుంది.