గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (17:48 IST)

సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న షీనా బోరా హత్య కేసు : రూ.150 కోట్ల కోసమే హత్యా?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా ఇప్పటివరకు ట్విస్టులపై ట్విస్టులిస్టూ వచ్చింది. తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అలాగే, ఈ హత్య కేసుకు సంబంధించి ఇద్రాణితో పాటు.. ఆమె మూడో భర్త పీటర్ ముఖర్జియాను ముంబై పోలీసులు బుధవారం విచారణ జరిపారు. 
 
స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా సతీమణి అయిన ఇంద్రాణి ముఖర్జియా... తమ సంస్థలను విక్రయించడం వల్ల రూ.450 నుంచి రూ.500 కోట్ల వరకు ఆదాయాన్ని గడించారు. ఈ సొమ్ముతో విదేశాల్లో స్థిరపడాలన్నది ఇంద్రాణి ప్రధాన ప్లాన్. 
 
అయితే, ఎందుకైనా మంచిదని ఇంద్రాణి ముఖర్జియీ తమకు వచ్చిన మొత్తంలో నుంచి రూ.150 కోట్లను షీనా బోరా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసింది. ఈ విషయం షీనా తెలియడం, ఆ డబ్బును తిరిగి బదిలీ చేయమంటే ఆమె నిరాకరించడం వల్లే ఈ హత్య జరిగిందనే వాదనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో రూ.150 కోట్లకు, హత్యకు ఏదైనా లింకు ఉందా అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 
మరోవైపు... తన కడుపున పుట్టిన బిడ్డ షీనా బోరాను హత్యచేసింది తానేనని ఇంద్రాణి అంగీకరించింది. పోలీసుల విచారణలో దాదాపు వారం రోజుల పాటు మౌనం పాటించిన ఆమె, ఎట్టకేలకు నోరు విప్పి తప్పు ఒప్పుకుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
ఆమెకు తొలుత విధించిన పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను ముంబై బాంద్రా కోర్టులో హాజరుపరిచిన విషయంతెల్సిందే. ఆ సమయంలో తన రెండో కుమార్తె విధితో కొద్దిసేపు మాట్లాడింది. ఆ తర్వాత కోర్టు ఆదేశం మేరకు ఆమె పోలీసు కస్టడీలోకి వెళ్లింది. ఈనెల 5వ తేదీ వరకు ఆమె పోలీసుల కస్టడీలోనే ఉండనుంది. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం నాటి విచారణలో ఆమె చేసిన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అంతకుముందంతా షీనా బతికేవుందని, అమెరికాలో చదువుతోందని, తానంటే కోపంతోనే బయటకు రావడం లేదని ఇలా అనేక కథలు చెబుతూ వచ్చిన ఇంద్రాణి ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. అంతేకాకుండా, హత్య వెనుక ఏ ఆర్థిక కారణాలు లేవని, ఎవరూ ప్రేరేపించలేదని చెప్పిన ఆమె, మైఖేల్‌ బోరాను హత్య చేయాలన్న ఉద్దేశం తనకేనాడూ లేదని స్పష్టం చేసినట్టు వినికిడి. 
 
అయితే, దీనిపై ముంబై పోలీసులు స్పందిస్తూ 'మొత్తం నేరంలో ఇప్పటికీ పూర్తి స్పష్టత రాలేదు. మాకు కొన్ని అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తాం' అని ఓ పోలీసు అధికారి వివరించారు. ఇదిలావుండగా, రాయగఢ్‌లో షీనా బోరా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతం నుంచి సేకరించిన నమూనాలు షీనావేనని గుర్తించేందుకు, ఆమె తండ్రిగా ప్రపంచానికి పరిచయమైన సిద్ధార్థ దాస్ను ముంబై రప్పించి డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారు.