గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (20:17 IST)

రాంపాల్ బాబా: పాలతో అభిషేకం, ఆ పాలతో కీర్, భక్తులకు ప్రసాదం

వివాదాస్పద బాబా రాంపాల్‌పై జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆయనను బుధవారం రాత్రి అరెస్టు చేసిన తర్వాత అందుకు సంబంధించిన వార్తాకథనాలు మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. రాంపాల్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే త్రిమూర్తులను తిరస్కరించి, కబీర్‌ను మాత్రమే దేవుడిగా భావించాలని చెప్పేవారు. ఆ కథనాల ప్రకారం - రాంపాల్ పాలతో స్నానం చేసేవాడని, ఆ పాలతో ఖీర్ తయారు చేసి ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసేవారని అంటున్నారు. 
 
హర్యానా రాష్ట్రంలోని హిస్సార్‌లో ఉన్న సత్‌లోక్ ఆశ్రమాధిపతి రాంపాల్ బాబా వివాదాస్పద స్వామిగా పేరుబడిన విషయం తెల్సిందే. తన అనుచరగణంతో కలిసి ఆశ్రమంలో చేసిన లీలలు ఆయన అరెస్టుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తొలుత నీటితో స్నానం చేయరట.. పాలతో స్నానం (అభిషేకం) చేసి.. ఆ పాలతో పాయసం చేసి అది భక్తులకు ప్రసాదంగా పంచుతారట. 
 
రాంపాల్ బాబాను మంగళవారం రాత్రి అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఐదుగురు మహిళలతో పాటు ఒక చిన్నారి కూడా మృత్యువాతపడింది. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న రాంపాల్ బాబా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఆయన దర్జా వెలగబెట్టిన విధానం, ప్రజలను భక్తి ముసుగులో వంచించిన వైనం అన్నీ బయటికొస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అనుచరులు బాబాకు పాలతో స్నానం (అభిషేకం) చేయిస్తారట.... ఆ పాలతో పాయసం చేసి ప్రసాదంలా అందరికీ పంచిపెడతారట. మనోజ్ అనే భక్త పుంగవుడు చెప్పిన విషయం ఇది! 
 
అయితే, క్రిషన్ అనే మరో భక్తుడు మనోజ్‌తో విభేదించాడు. అభిషేకం చేసిన పాలతో పాయసం చేయరని, అయితే, బాబా ధ్యానం చేస్తున్నప్పుడు సీలింగ్ నుంచి పాలు ధారలా ఆయనపై పడుతుంటాయని తెలిపాడు. ఆయన ధ్యానఫలం కాస్తా వేరే పాలతో వండిన పాయసాన్ని ఆవహిస్తుందట. అదే మహాప్రసాదం అనుకుని భక్తులు కళ్లకు అద్దుకుని మరీ తింటారట. అన్నట్టు... ఆశ్రమంలో జరిగిన అల్లర్లలో క్రిషన్ భక్త మహాశయుడి తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.