శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (05:24 IST)

కులాన్ని, భాషను, వేషధారణను, పుట్టుకను వెక్కిరించారో.. జైలు ఖాయం

నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు వాగారో.. ఇకనుంచి జైలు కూడు ఖాయం, ఇక ముందు ఎవరు ఏ కులాన్ని తిట్టినా, వారి భాషను ఎగతాళి చేసినా... వేషధారణపై అవహేళన చేసినా... వంశం, పుట్టుకలపై వెక్కిరించినా నేరంగానే పరిగణిస్తూ భారతీయ శిక్షాస్మృతిలో మార్పు చేశారు. రాష్ట్

నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు వాగారో.. ఇకనుంచి జైలు కూడు ఖాయం, ఇక ముందు ఎవరు  ఏ కులాన్ని తిట్టినా, వారి భాషను ఎగతాళి చేసినా... వేషధారణపై అవహేళన చేసినా... వంశం, పుట్టుకలపై వెక్కిరించినా నేరంగానే పరిగణిస్తూ భారతీయ శిక్షాస్మృతిలో మార్పు చేశారు. రాష్ట్రాలు ఆమోదం తెలిపితే కేంద్రం ప్రభుత్వం ఐపీసీ 509(ఎ) సవరణపై ముందుకు వెళ్లనుంది. ఈ సవరణతో కులం, జాతి పేరుతో అవమానాలకు గురవుతున్న వర్గాల చేతికి కేంద్రం వజ్రాయుధాన్నిస్తోంది. అవమానించిన వాళ్లను కటకటాల వెనక్కినెట్టే కఠిన చట్టం తయారవుతోంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే జాతిపరంగా అవమానం జరిగినపుడు చట్టపరమైన రక్షణ లభిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల రక్షణ కోసం తాజాగా భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లో తెస్తున్న మార్పులు ఇప్పుడు అన్ని జాతులకూ దాదాపు అలాంటి రక్షణనే కల్పించనున్నాయి. ఈ చట్టం అమలులోకి వస్తే...
 
జన్మస్థలం, జాతి సంబంధ ముఖ కవళికలు, ప్రవర్తన, అనుసరించే సంప్రదాయాలు, వేషధారణ ఆధారంగా.... ఒక జాతి వ్యక్తిని అవమానపరిచే ఉద్దేశంతో.... ఏ పదం మాట్లాడినా, ఏ శబ్దం చేసినా, సైగ చేసినా, అవమానించే పదాన్ని లేదా శబ్దాన్ని సూచించే ఏదైనా వస్తువును చూపించినా... దాన్ని బాధితుడు విన్నపుడు.... చూసినపుడు... అవమానించిన వ్యక్తి శిక్షార్హుడవుతారు. మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ వేయొచ్చు. 153(సి) ప్రకారం... పైన చెప్పిన అంశాల ఆధారంగా జాతి విద్వేషాలను ప్రోత్సహించినా, హింసాత్మక దాడుల్లో పాల్గొన్నా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక జాతికి చెందిన వ్యక్తి గౌరవానికి గానీ, కొద్దిమంది వ్యక్తుల గౌరవానికి గానీ భంగం కలిగించే ప్రవర్తనలన్నీ 153(సి) నిబంధన కిందకు వస్తాయి.
 
పలు ప్రాంతాల్లో రజకులు, క్షురకులు, పిచ్చకుంట్ల, బుడబుడకలు వంటి కులాలపై వివక్ష ఉంది. సినిమాలు, ఇతర కార్యక్రమాల్లో కొన్ని కులాల వారిని, వారి వేషభాషలను కించపరుస్తున్నారని విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, తెలంగాణ భాష, యాసను కించపరిచారనే విమర్శలు ఉ న్నాయి. ఇక ముందు సినిమాల్లో యాస, భాషను కించపరిచినా కేసులు తప్పవు. చట్టానికి కోరలు పెట్టనుండటంతో జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సెక్షన 509 ప్రకారం మహిళల్నీ దూషించినా, కించపరిచినా వారి ఆత్మగౌరవానికి భంగకరంగా వ్యవహరించినా ఏడాది జైలు శిక్ష విధించవచ్చు. 
 
509(ఎ) నిబంధన అమల్లోకి వస్తే కులం, భాష, వేషధారణ, వంశం, పుట్టుకలపై కామెంట్లు చేసినా కించపరిచినా తీవ్రమైన నేరం అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కుల దూషణ నుంచి రక్షణ ఉంది. ఇలాంటి చట్టాన్ని కూడా కొందరు తమ చేతిలో పావుగా వాడుకున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కొత్తగా 509(ఎ) అందుబాటులోకి వస్తే ఆర్థికంగా బలమైన వర్గాలు తమ జాతిని దూషించారంటూ బలహీన వర్గాలను ముప్పతిప్పలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.  
 
2014 జనవరిలో దేశ రాజధాని ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 19 ఏళ్ల యువకుణ్ణి స్థానికులు నేరస్థుడిగా భావించి కొట్టిచంపారు. ఈ సంఘటన దేశ ప్రజలందర్నీ కదిలించింది. ఢిల్లీలో, ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద అలజడే చెలరేగింది. వారిని శాంతింప జేసేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎం.కె.బెజ్‌బారువా కమిటీని వేసింది. కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగానే కులం, జాతి పరంగా కించపరచడాన్ని మూడేళ్ల జైలుశిక్ష వేయదగ్గ తీవ్ర నేరంగా పరిగణిస్తూ ఐపీసీలో మార్పులు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వాటి ప్రకారం ఐపీసీలో 153(సి), 509(ఎ) అని రెండు సెక్షన్లను సవరిస్తారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలు తెలుపగానే వచ్చే సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రతిపాదింనున్నట్లు సమాచారం.