గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (10:31 IST)

ఇరోమ్ చాను షర్మిల మళ్లీ అరెస్టు : సూసైడ్ కేసు రిజిస్టర్!

మణిపూర్ ఐరన్ లేడీ, పౌర హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ చాను షర్మిలను ఆ రాష్ట్ర పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. మణిపూర్ సెషన్స్ కోర్టు ఆదేశాలతో జైలు గోడల నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన కేవలం 36 గంటల్లోనే ఆమెపై ఆత్మహత్యాయత్న కేసును నమోదు చేసి మళ్లీ అరెస్టు చేశారు. ఇపుడు షర్మిలతో పాటు ఆమె తల్లిని కూడా మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. 
 
మణిపూర్‌ రాష్ట్రంలో అమలులో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ గత 14 ఏళ్లుగా ఆమె నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల ఆమెపై మోపిన సూసైడ్ కేసులో పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపక పోవడంతో ఆమెను విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. 
 
దీంతో ఆమె 14 యేళ్ల నిర్బంధం తర్వాత కోర్టు ఆదేశాలతో గత బుధవారం విడుదలయ్యారు. అయితే, విడుదలైనప్పటి నుంచి ఇరోమ్ షర్మిల మళ్లీ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారని... ఆహారం తీసుకోకుండా ఆత్మహత్యకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో... పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి తరలించి ముక్కుద్వారా ద్రవాహాన్ని అందిస్తున్నారు. ఆమెపై తాజాగా ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు మణిపూర్ ఏడీజీ సంతోష్ మాచెర్ల తెలిపారు.