శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 30 జులై 2015 (13:27 IST)

ముంబయి పేలుళ్ల తరువాత మెమన్ పాకిస్తాన్ ఎందుకెళ్లాడు..? అక్కడ ఇళ్లు కొన్నాడా..?

ముంబై పేలుళ్ల తర్వాత యాకూబ్‌ మెమెన్‌ పాకిస్తాన్ ఎలా వెళ్లాడా ? అక్కడ అతనికి ఎవరు సాయం చేశారు.? అసలు అతని కుటుంబానికి పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆశ్రయం కల్పించిందా ? ఇలాంటి ఎన్నో అంశాలను యాకూబ్ మెమెనే నేరుగా చెప్పారు. ఓ టీవీ చానెల్‌కు ఈ అంశాలన్నిటిపై 1994లోనే యాకూబ్‌ మెమెన్‌ సమాధానం ఇచ్చాడు. 
 
యాకూబ్‌ మెమెన్‌ను గురువారం ఉదయం ఉరి తీయనున్నారు. ఆయన చాలా ఏళ్లుగా జైలులో ఉన్నారు. మెమెన్‌ తాను నిర్దోషినని చెబుతూనే తనకు పాకిస్తాన్ ఎలా సాయం చేసిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. పేలుళ్ళు తరువాత మార్చి ఇక్కడ నుంచి మెమెన్ దుబాయ్ పారిపోయాడు. అక్కడ నుంచి ఎటువంటి ఇమిగ్రేషన్ లేకుండానే నేరుగా పాకిస్తాన్ విమానంలో కరాచీ పారిపోయాడు. తరువాత కుటుంబాన్ని కూడా అక్కడికే పిలుచుకున్నారు. అందుకు ఆసిఫ్‌ అనే వ్యక్తి సాయం చేశారని చెప్పాడు. కరాచీ విమానాశ్రయంలో కూడా ఎలాంటి తనిఖీలు చేయలేదు. తన ఇండియన్‌ పాస్‌పోర్టు తీసుకున్నారని, ఏడాది తర్వాత తిరిగి ఇచ్చారని మెమెన్‌ తెలిపాడు. 
 
పాకిస్తాన్‌లో టైగర్‌కు ఎలాంటి సంబంధాలు లేవని, తోఫిక్‌తో కలిసి దుబాయ్‌లో స్మగ్లింగ్‌ చేసేవాడని, తోఫిక్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు ఆర్థికంగా టైగర్‌, తోఫిక్‌ ఆదుకున్నారని మెమెన్‌ వెల్లడించాడు. ఆరు నెలల తర్వాత నేను కూడా నిర్మాణ రంగంలోకి వచ్చానని, అందుకు వాళ్లిద్దరూ సాయం చేసి, అండగా ఉన్నారని యాకూబ్‌ తెలిపాడు. పాకిస్తాన్‌ అధికారులు కూడా తనకు పాస్‌పోర్టు ఇచ్చారని, సైనికులు ఉండే హౌసింగ్‌ సొసైటీలో ఆశ్రయం కల్పించారని మెమెన్‌ తెలిపాడు. 
 
తన కోసం కరాచీలో ప్లాట్‌ కొన్నారని, టైగర్ రూ. 60 లక్షలు ఖర్చు పెట్టి దీనిని కొనుగోలు చేశారని చెప్పారు. పాక్‌లో బాగానే ఉండేవాడినని చెప్పుకొచ్చారు. ముంబై పేలుళ్ల వెనుక తనకు సంబంధంలేదని ఆయన స్పష్టం చేశాడు. తన అన్న టైగర్‌ మెమెన్‌ పేలుళ్లకు సహకరించాడని యాకూబ్‌ వెల్లడించాడు. అందుకే టైగర్‌కు పాక్‌ సహకరించిందని, నేరం తనపై రుద్దారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ముంబై పేలుళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని యాకూబ్‌ మెమెన్‌ మరోసారి స్పష్టం చేశాడు.