శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (11:23 IST)

పఠాన్‌కోట్ తర్వాత జైసల్మేర్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర గురి!

పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి విధ్వంసం సృష్టించగా, ఇపుడు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ఎయిర్‌ఫోర్సు స్టేషన్‌పై గురి పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 
 
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ గురించి ఓ అపరిచితుడు వాకబు చేయడం కలకలం రేపింది. జైసల్మేర్‌లోని ఓ వెండి దుకాణానికి వచ్చిన అపరిచితుడు స్థానిక ఐఎఎఫ్‌ స్టేషన్‌ గురించి ఆరా తీశాడు. వివరాలు తెలిపితే అదనంగా సొమ్ము ఇచ్చేందుకూ సిద్ధమయ్యాడు. అతను వెళ్లిన వెంటనే దుకాణదారుడు పోలీసులకు తెలియజేయగా, సీసీ టీవీ పుటేజీ ఆధారంగా వేట ప్రారంభించారు. 
 
కాగా, గుజరాత్‌ పోర్టు తీరంలో హద్దుమీరి భారత సముద్ర జలాల్లోకి వచ్చిన పాకిస్థాన్‌ చేపల బోటును భారత కోస్ట్‌ గార్డు అడ్డుకుని స్వాధీనం చేసుకుంది. బోటులోని 11 మంది పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. మరోవైపు వెబ్‌సైట్‌లలో తన ఉగ్ర ప్రసంగాలను ఉంచుతూ దేశంలో ఉగ్రదాడులకు కుట్రచేశారన్న ఆరోపణలతో ఢిల్లీలోని సీలంపూర్‌లో అబ్దుస్‌ సమీ కాసిం అనే మతగురువును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు.