గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 జూన్ 2016 (10:04 IST)

ఇస్రో సరికొత్త రికార్డు.. పీఎస్ఎల్వీ సీ-34 రాకెట్ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ-34 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ఒకేసారి 20 ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇందులో మూడు స్వదేశీ, 17 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. దీంతో షార్‌లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పీఎస్‌ఎల్వీ సీ-34 విజయవంతంపై రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ తరహా ప్రయోగం చేయడం ఇస్రో చరిత్రలో సరికొత్త రికార్డు కావడం గమనార్హం. ఈ ఉపగ్రహాలు ఐదేళ్ళపాటు సేవలు అందించనున్నాయి. 
 
నింగిలోకి దూసుకెళ్లిన ఉపగ్రహాలు.. ఉపయోగాలు 
ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ప్రయోగంలో భాగంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టే ఉపగ్రహాలూ వాటి ఉపయోగాలు చూస్తే.. 
 
కార్టోశాట్‌-2సీ: భూమిని నిత్యం పరిశీలిస్తూ (కాంక్రోమేటిక్‌ అండ్‌ మల్టీ స్కెట్ట్రల్‌ కెమెరా ద్వారా) ఛాయాచిత్రాలను తీసి పంపనుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, తాగునీటి పంపిణీ, తీర ప్రాంత భూముల సమాచారాన్ని కార్టోశాట్‌ అందించనుంది. 
 
సత్యభామశాట్‌: గ్రీన్‌హౌస్‌ వాయువుల సమాచారాన్ని ఈ ఉపగ్రహం సేకరించనుంది. కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, డై ఆక్సైడ్‌, మీథేన్‌, హైడ్రోజన్‌ క్లోరైడ్‌ వాయువుల డేటాను సేకరించి పంపనుంది. 
 
స్వయంశాట్‌: ఒక కిలో బరువు కలిగిన ఈ ఉపగ్రహం పాయింటూపాయింట్‌ మెసేజింగ్‌ సర్వీస్‌ను అందించనుంది. 
 
లపాన్‌-ఎ3 (ఇండోనేషియా): భూమిపై సహజవనరుల, వాతావరణ పరిశోధన కోసం ఇండోనేషియా పంపుతున్న ఉపగ్రహమిది. 
 
బీరోస్‌ (జర్మనీ): అంతరిక్షంలో అధిక ఉష్ణోగ్రతలను ఈ ఉపగ్రహం తెలియజేయనుంది. 
 
ఎం-3ఎంశాట్‌ (కెనడా): ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ సంకేతాలను అందించనుంది. 
 
జీహెచ్‌జీశాట్‌ (కెనడా): వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌, మిథేన్‌ వాయువుల సమాచారాన్ని అందజేయనుంది. 
 
స్కైశాట్‌-జెన్‌2-1 (యూఎస్ఏ): భూమిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు జరిగే మార్పులను ఈ ఉపగ్రహం ఫోటోలు హైక్వాలిటీ వీడియోలు తీసి పంపనుంది. 
 
డవ్‌ శాటిలైట్‌ (యూఎస్ఏ): ఇవి మొత్తం 12 ఉపగ్రహాలు. కక్ష్యల్లో పావురాల్లా తిరుగుతూ భూమిని పరిశోధిస్తూ భూమిపై జరిగే మార్పులను చిత్రాలుగా తీసి పంపుతాయి. అందుకే ఈ బుల్లి శాటిలైట్‌లకు డవ్‌ (పావురాలు) అని పేరు పెట్టారు.