గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (12:19 IST)

పన్నీర్‌కు మద్దతుగా జల్లికట్టు తరహా ఉద్యమం.. పళనికి కష్టాలే..అప్పుడే హెచ్చరించారుగా?

తమిళనాట దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏ రోజున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారో ఆ రోజు నుంచి ఆమె మరణం, ఆపై పన్నీర్ సెల్వం సీఎం.. చిన్నమ్మకు పార్టీ పదవి.. ఆపై పన్నీర్ తిరుగుబాటు.. చిన్నమ్మకు జైలు.. పళని స్వామికి

తమిళనాట దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏ రోజున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారో ఆ రోజు నుంచి ఆమె మరణం, ఆపై పన్నీర్ సెల్వం సీఎం.. చిన్నమ్మకు పార్టీ పదవి.. ఆపై పన్నీర్ తిరుగుబాటు.. చిన్నమ్మకు జైలు.. పళని స్వామికి సీఎం పోస్ట్ ఇవ్వడం వంటి వివిధ పరిణామాలతో ప్రజలు విసిగిపోయారు. దీంతో జల్లికట్టు సంప్రదాయ క్రీడను పోరాటం చేసి కాపాడుకున్న తమిళ యువత.. పన్నీరు సెల్వంకు మద్దతిచ్చేందుకు రెడీ అవుతోంది. 
 
సోషల్ మీడియాలో ఆన్ లైన్ సర్వే ద్వారా ప్రజలు పన్నీర్ సెల్వంకు మద్దతిచ్చినా.. చిన్నమ్మ ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి తనపై తిరుగుబాటు చేశాడనే కారణంతో పన్నీరును పక్కనబెట్టి పళనికి సీఎం పోస్ట్ ఇచ్చి జైలుకెళ్లిపోయింది. ఇదంతా ప్రజలకు ఏమాత్రం మింగుడుపడట్లేదు. చిన్నమ్మ చేసిన కార్యానికి ప్రజల ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేలు వంత పాడటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంకా అమ్మ పార్టీ కోసం చిన్నమ్మపై తిరుగుబాటు చేసిన పన్నీరుకు ఎమ్మెల్యేలు మద్దతివ్వకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. శశికళ సీఎం అయితే జల్లికట్టు తరహా ఉద్యమంతో తిరుగుబాటు చేస్తామని ఇప్పటికే ప్రజలు హెచ్చరించిన తరుణంలో.. ఆమె విధేయుడు పళని స్వామికి కూడా అదే పరిస్థితి తప్పదంటున్నారు. 
 
పళని స్వామి.. ఆయన కిందగల ఎమ్మెల్యేలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని యువత డిసైడైపోయింది. ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వని ఎమ్మెల్యేలు చిన్నమ్మ చెప్పిందని పళనికి సపోర్ట్ చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని యువత సోషల్ మీడియాలో ఫైర్ అయింది. కళ్లారా మాఫియాతో అంతా నడుపుతూ.. అవినీతి కేసులో ఊచలు లెక్కిస్తున్న చిన్నమ్మ చెప్పిందని.. తమిళనాట ప్రభుత్వం ఏర్పడటం సరికాదని ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వారానికి పైగా తమిళ పాలిటిక్స్‌లో కొనసాగిన హైడ్రామా పళనిస్వామి ప్రమాణస్వీకారం తర్వాత కాస్తంత సద్దుమణిగినట్టుగానే కనిపించినా.. మరో ఉపద్రవానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెంటికి చెడ్డ రేవడిలా తయారైన పన్నీర్ సెల్వం ప్రస్తుత సీఎం పళనిస్వామిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందివచ్చిన అవకాశంలో ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడంలో విఫలమైన పన్నీర్ సెల్వం పరిస్థితి ఇప్పుడు పూర్తిగా చేయిదాటిపోయినట్టే. 
 
ఇదిలా ఉంటే, పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో పన్నీర్ వర్గం నుంచి కొంతమంది మద్దతుదారులు పక్కకు తప్పుకుంటుండగా మరికొంతమంది మాత్రం పోరాడేందుకు సిద్దమవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా జల్లికట్టు తరహా ఉద్యమానికి పిలుపునిస్తూ కొంతమంది నెటిజెన్స్ హల్ చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పళనిస్వామికి వ్యతిరేక పోస్టులతో నెటిజెన్స్ హోరెత్తించారు. సీఎంగా పళనిస్వామి బలనిరూపణకు సిద్దమయ్యే నాటికి ఆందోళనను ఉధృతం చేయాలని భావిస్తున్నారు.