గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (12:15 IST)

జమ్మూకాశ్మీర్‌లో సంకీర్ణ సర్కారు : పీడీపీ - బీజేపీల మధ్య సయోధ్య!

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటి వరకు నెలకొనివున్న ప్రతిష్టంభన తొలగిపోనుంది. ఈ రాష్ట్రంలో కొత్తగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీడీపీ, బీజేపీల మధ్య సయోధ్య కుదిరింది. ముఖ్యమంత్రి పదవిని పీడీపీకి, ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి ఇచ్చేలా ఇరు పార్టీ నేతలు ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం.
 
పీడీపీ స్థాపకుడు ముఫ్తీ మహ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా పిబ్రవరిలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారని సమాచారం. ఇక ఉపముఖ్యమంత్రి పదవి బీజేపీ తీసుకుంటుండగా, ఆ పార్టీ నేత నిర్మల్ సింగ్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పీడీపీతో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు దాదాపు ఓ ఏకాభిప్రాయానికి వచ్చాం, త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో ఉత్తమమైన రాజకీయనేత, మంచి క్యాబినెట్ జట్టుతో సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పడుతుంది అని బీజేపీ బిల్వార్ ఎమ్మెల్యే నిర్మల్ సింగ్ తెలిపారు. 
 
మరోవైపు పీడీపీ అధికార ప్రతినిధి నాయీమ్ అక్తర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఫిబ్రవరి మధ్యలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పారు. కాగా పీడీపీకి హోం, ఆర్థిక శాఖలు, బీజేపీకి ఉపముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్ పదవులు దక్కుతాయని తెలిసింది. ఈ ఫార్ముల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్నికల ఫలితాలు వెల్లడైన నెల తర్వాత జేకేలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది.