గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (17:41 IST)

జమ్మూకాశ్మీర్ వరదల్లో 277 మంది మృతి : ఒమర్ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల్లో 277 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. గత 50 యేళ్ళలో ఎన్నడూ లేనివిధంగా జమ్మూకాశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయని చెప్పారు. 
 
ఈ భారీ వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 277 మంది మృతి చెందారని తెలిపారు. అయితే, తొలుత భయపడినట్టుగా, మరణాల సంఖ్య పెరగలేదన్నారు. వరదల సమయంలో రాజౌరీ జిల్లాలో ఓ పెళ్లి బస్సు కొట్టుకుపోయి 44 మంది చనిపోయారు. వారితో సహా ఒక్క జమ్మూలోనే 203 మంది మరణించారని వివరించారు. 
 
సహాయక చర్యల్లో భాగంగా 74 మృతదేహాలను కాశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో బయటకు తీసినట్లు ఒమర్ వివరించారు. కాగా, కొన్ని మృతదేహాలను జంతువులు తింటున్నాయని, మరికొన్ని దేహాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు కొట్టుకుపోయాయన్న వార్తలను ఆయన తిరస్కరించారు. కాగా, వరద బాధితులను రక్షించేందుకు సైన్యం అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు.