గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 12 జనవరి 2016 (19:46 IST)

మావాళ్లకు జల్లికట్టు అంటే ఇష్టం... ఆర్డినెన్స్ తెచ్చయినా జల్లికట్టు నిర్వహించాలి... జయ లేఖ

జల్లికట్టుపై కేంద్రం ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి మరోసారి తన లేఖ ద్వారా విన్నపాన్ని తెలియజేశారు. ఆర్డినెన్స్ తెచ్చయినా జల్లికట్టు నిర్వహించేలా చూడాలంటూ లేఖ ద్వారా తెలియజేశారు. జల్లికట్టును సాంస్కృతిక, సంప్రదాయ క్రీడగా భావించాలని కోరిన ఆమె జల్లికట్టు అనేది తమిళుల మనోభావాలతో ముడిపడిన అంశంగా పరిగణించాలని పేర్కొన్నారు. కాగా జల్లికట్టుపై కేంద్రం అనుమతులను నిలిపివేయాలంటూ వన్యప్రాణి సంరక్షణ బోర్డు, పెటా సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు మంగళవారం నాడు స్టే విధించింది.
 
నిజానికి గత నాలుగేళ్లుగా ఈ పోటీలపై నిషేధం కొనసాగుతూ వచ్చింది. అయితే, జల్లికట్టును జరుపుకోవచ్చంటూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తమిళులకు తీపి కబురు చెప్పింది. సంప్రదాయాలను గౌరవించే క్రమంలోనే జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కూడా ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. 
 
అయితే జల్లికట్టు పేరిట జంతువులను హింసిస్తున్నారంటూ పలువురు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. జంతు హింసకు చెక్ పెట్టడమే కాకుండా పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదమున్న జల్లికట్టును నిషేధించాలని వారు తమ పిటిషన్లలో కోర్టును అభ్యర్థించారు. 
 
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. జల్లికట్టును నిర్వహించుకోవచ్చంటూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో సంక్రాంతి సందర్భంగా తమిళనాట జల్లికట్టు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
 
అంతకుముందు.. ఈ పిటీషన్‌పై విచారణ సందర్భంగా ఓ నాటకీయ పరిణామం జరిగింది. ఈ విచారణ నుంచి తాను తప్పుకొంటున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్‌.భానుమతి మంగళవారం ఉదయం ప్రకటించారు. ఆమె గతంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వహించారు.