గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (10:48 IST)

జయలలితకు ఆకుపచ్చ రంగు అంటే ప్రాణం.. అందుకే అంత్యక్రియల్లో సైతం..

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆకుపచ్చ రంగు అంటే అమితమైన ఇష్టం. అందులోనూ ముదురు ఆకుపచ్చ రంగు అంటే ఆమెకు ప్రాణం. అందుకే ఆమె నిత్యం ముదురు ఆకుపచ్చ రంగు చీరనే ధరిస్తూ ఉంటారు. ఆమె జీ

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆకుపచ్చ రంగు అంటే అమితమైన ఇష్టం. అందులోనూ ముదురు ఆకుపచ్చ రంగు అంటే ఆమెకు ప్రాణం. అందుకే ఆమె నిత్యం ముదురు ఆకుపచ్చ రంగు చీరనే ధరిస్తూ ఉంటారు. ఆమె జీవించి ఉన్నప్పుడే కాదు.. చివరకు ఆమె అంతిమ యాత్రను కూడా ఆ చీరలోనే పూర్తి చేశారు. 
 
74 రోజుల పాటు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన జయలలిత ఆదివారం సాయంత్రం గండెపోటు రావడంతో సోమవారం అర్థరాత్రి కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆమె అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. అపోలో ఆస్పత్రిలో మృతి చెందిన జయలలిత భౌతికకాయాన్ని తొలుత పోయస్ గార్డెన్‌లోని ఆమె నివాసానికి తరలించారు. అక్కడ నుంచి గవర్నమెంట్ ఎస్టెట్‌లోని రాజాజీ హాల్‌ వద్దకు చేరి ప్రజల సందర్శనార్థం ఉంచారు.  
 
పోయెస్ గార్డెన్ నుంచి రాజాజీ హాల్‌కు మారిన ఆమె భౌతికకాయాన్ని ఎరుపు రంగు బోర్డరు ఉన్న ఆకుపచ్చ రంగు చీరతోనే సందర్శనార్థం ఉంచారు. ఈ సంవత్సరం మే 16న ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణస్వీకారం చేసేటప్పుడు, గతేడాది ఐదోసారి చేసేటప్పుడు కూడా ఆమె ఆకుపచ్చ చీరనే ధరించారు. అక్రమాస్తుల కేసు నుంచి బయటకు వచ్చాక గత 8 నెలల నుంచి ఆమె ప్రజలకు కనిపించిన ప్రతీసారి ఆకుపచ్చ చీరనే ధరించారు. 
 
ఆమె ప్రమాణస్వీకారం చేసిన మద్రాసు వర్సిటీ ఆడిటోరియంను కూడా ఆకుపచ్చ రంగులోనే అలంకరించారు. అప్పటి గవర్నర్ కె. రోశయ్య ఆమెకు అందించిన పూల బొకేకు కూడా ఆకుపచ్చ కవర్లే చుట్టారు. ఆమె ఆకుపచ్చరంగు పెన్నునే ఉపయోగించేవారు. వేలికున్న ఉంగరంలో కూడా ఆకుపచ్చ రాయే ఉండేది. పార్టీ మహిళల్లో కూడా చాలామంది ఆకుపచ్చ రంగు చీరల్లో కనిపించేవారు. అంతెందుకు ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా.. అక్కడ ఏర్పాటు చేసే వేదికపై సైతం ఆకుపచ్చ రంగు తివాచీలోనే పరుస్తారు.