శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (19:33 IST)

రూ.100 కోట్ల అపరాధం విధింపే జయలలితకు శ్రీరామరక్ష!

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్షను అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెంగుళూరు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైకేల్ డి.కున్హా విధించిన రూ.100 కోట్ల అపరాధమే శ్రీరామరక్ష కానుంది. భారతీయ శిక్షా స్మృతి చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం, అందివచ్చిన అధికారాన్ని ఆసరా చేసుకుని అక్రమాస్తులు కూడబెట్టి, దోషులుగా తేలిన వారిపై, వారు సంపాదించిన దానికంటే అధికంగా జరిమానా విధించరాదని స్పష్టంగా చెపుతోంది. 
 
అయితే, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రూ.66.65 కోట్ల విలువ చేసే అక్రమాస్తులు కూడబెట్టారన్నది సీబీఐ వాదన. అయితే, జయలలిత ఆస్తుల విలువ రూ.53.6 కోట్లేనని సాక్షాత్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి డి కున్హానే ఒకానొక సందర్భంలో లెక్కగట్టారు. 
 
ఈ నేపథ్యంలో జయలలితపై రూ.100 కోట్ల జరిమానా విధించడం అనేది చెల్లదని ప్రముఖ న్యాయనిపుణులు బలంగా వాదిస్తున్నారు. కర్ణాటక హైకోర్టులో జయలలిత తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌లోనూ, ఆమె తరపు న్యాయవాదులు ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే వాదోపవాదాల్లోనే ఈ అంశంపైనే వారు ప్రధానంగా జయలలిత తరపున పోరు సాగించనున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా ప్రకటిస్తూ పరప్పణ అగ్రహార ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి.కున్హా గత శనివారం సంచలన తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పులో రూ.66.65 కోట్ల మేర అక్రమాస్తులు సంపాదించిన జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన డి.కున్హా, జరిమానాగా రూ.100 కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పారు. జరిమానా కట్టని పక్షంలో మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. ఇపుడు ఈ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి.కున్హా వెలువరించిన తీర్పే, ఆమెను బయటపడేస్తుందని గట్టిగా వాదిస్తున్నారు.