బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (18:23 IST)

జయలలిత జైలు జీవితం : సాంబారు ఇడ్లీ.. రాగి సంగటే ఆహారం!

అక్రమాస్తుల సంపాదన కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష పడిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు. బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఏ క్లాస్ జైలులో ఉంటున్న ఆమె.. ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, తన ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుని తర్వాత తన దిన చర్యల్లో నిమగ్నమవుతున్నారు. పిమ్మట జైలు అధికారులు ఇచ్చే తమిళ, ఆంగ్ల పత్రికలు తిరగేస్తూ.. కాలక్షేపం చేస్తున్నారు. 
 
జైలు నిబంధనల మేరకు... సాధారణ ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే ఆమెకు కూడా అందజేస్తున్నారు. అయితే, జయలలిత మాత్రం ఉదయం పూట సాంబారు ఇండ్లీ, రాగి సంగటినే ఎక్కువగా ఆరగిస్తున్నారు. ఖైదీ నంబర్ 7402గా ఉన్న జయలలితను మహిళా బారక్‌కు ఆనుకునివున్న 23వ నంబర్ వీవీఐపీ గదినే కేటాయించారు. ఖాళీ సమయాల్లో జైలు ప్రాంగణంలోనే పచార్లు చేస్తున్నారు. అయితే, శిక్షా కాలంలో ఎలాంటి పనులు చేయాలన్న అంశాన్ని జైలు సిబ్బంది ఆమెకే వదిలివేశారు.