గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (01:35 IST)

జయలలిత ఆరోగ్యం విషమం??!! తక్షణం విధుల్లో చేరాల్సిందిగా పోలీసులకు ఆదేశం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సోమవారం ఉదయం 7 గంటలకంతా విధుల్లో చేరాల్సిందిగా రాష్ట్ర పోలీసులకు ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశార

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సోమవారం ఉదయం 7 గంటలకంతా విధుల్లో చేరాల్సిందిగా రాష్ట్ర పోలీసులకు ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. వీరంతా వారి యూనిఫారంల్లో కేటాయించిన వాహనాల్లో అందుబాటులో ఉండాలని పేర్కొంది.
 
గత సెప్టెంబర్ 22వ తేదీ నుంచి చెన్నై అసోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆమెను ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్తతో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 
 
ఈ విషయం తెలుసుకోగానే తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకుని జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
 
అలాగే, ప్రస్తుతం జయలలితకు హార్ట్ అసిస్ట్ డివైస్ ద్వారా ప్రత్యేక చికిత్స అందజేస్తున్నారు. క్రిటికల్ కేర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో జయలలిత చికిత్స పొందుతున్నారు. గతంలో చెన్నైకి వచ్చి జయలలితకు చికిత్స అందజేసిన లండన్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ పీలేతో అపోలో వైద్యుల బృందం సంప్రదింపులు జరుపుతోంది. అపోలో కార్డియాలజిస్ట్‌లు, పల్మనాలజిస్ట్‌లతో పాటు ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన హృద్రోగ నిపుణుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. 
 
మరోవైపు.. జయలలిత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. అపోలో ఛైర్మన్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఫోన్ చేసి... జయలలిత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయ ఆరోగ్యంపై తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ఫోన్ చేసి సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు సోమవారం ఉదయం చెన్నైకు రానున్ననట్టు సమాచారం. 
 
అలాగే, సీఎం జయలలిత అనారోగ్యం నేపథ్యంలో మద్రాసు, అన్నా యూనివర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీలు, పాఠశాలలకు సోమవారం సెలవుదినంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తమిళనాడు ఎడ్యూకేషన్ బోర్డ్ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఆస్పత్రిలోనే రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. అమ్మ ఆరోగ్య పరిస్థితిపై పన్నీర్ సెల్వం అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు చర్చించినట్లు సమాచారం. ఆమె అనారోగ్యం నుంచి మళ్లీ కోలుకుంటారని రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
జయలలిత ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్త వెలువడటంతో జయ అభిమానులు, అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అర్థరాత్రి కూడా అస్పత్రికి భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద కేంద్ర, పారా మిలిటరీ బలగాలను మొహరించారు. మరోవైపు చెన్నై పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సీనియర్ అధికారులు సమావేశమై పరిస్థితిపై సమీక్ష జరిపారు.