శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (10:01 IST)

జయలలిత కాళ్లను తొలగించినట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులే: ప్రతాప్ సి రెడ్డి

దివంగత తమిళనాడు సీఎం జయలలితకు అందించిన వైద్యానికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నామని అపోలో ఆస్పత్రుల ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి స్పష్టం చేశారు. జయలలితకు అందించిన చికిత్సను ఎప్పటికప్ప

దివంగత తమిళనాడు సీఎం జయలలితకు అందించిన వైద్యానికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నామని అపోలో ఆస్పత్రుల ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి స్పష్టం చేశారు. జయలలితకు అందించిన చికిత్సను ఎప్పటికప్పుడు వెల్లడించామని తెలిపారు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ప్రతాప్‌ సి రెడ్డి సమాధానమిచ్చారు. 
 
జయలలిత మృతిపై వస్తున్న ఊహాగానాలను ఖండించారు. జయలలిత కాళ్లను తొలగించినట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. జయలలిత మృతికి సంబంధించిన అన్ని వివరణలను ఆసుపత్రి యంత్రాంగం తరపున ఇప్పటికే బహిర్గతం చేశామని తెలిపారు. సీబీఐ దర్యాప్తు చేసినా సమగ్ర వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతాప్ సి రెడ్డి తెలిపారు.
 
అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరి, 74 రోజుల చికిత్స అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్‌ ఐదే తేదీన కన్నుమూశారు. అయితే ఆమె అందించిన చికిత్సపై సొంత పార్టీ ఏఐడీఎంకేలోని కొందరు నాయకులు సహా ప్రతిపక్ష డీఎంకే సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎంకే చీఫ్‌ కరుణానిధైతే ఒక అడుగు ముందుకేసి జయ ఫొటోలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
కానీ ఎలాంటి ఫొటోలు విడుదలకాకుండానే జయ పరమపదించారు. ఆమె మరణానంతరం చికిత్సకు సంబంధించిన కొన్ని వివరాలను ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అలాంటివాళ్లందరికీ సమాధానంగా జయకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రుల చైర్మన్‌ ప్రతాప్‌.సి.రెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రతాప్‌ సి రెడ్డి అన్నారు. ఈ విషయంలో దాగుడుమూతలకు తావులేదని తెలిపారు. తాను మొదటి నుంచి చెపుతున్నట్లే.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత గుండెపోటుకు గురికావడం వల్లే జయ చనిపోయారని మరోసారి స్పష్టంచేశారు.