గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (10:26 IST)

పర్యావరణ అనుమతులపై జయంతి నటరాజన్ వద్ద సీబీఐ విచారణ!?

కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా జయంతి నటరాజన్ ఉన్న సమయంలో మంజూరు చేసిన అనుమతులకు సంబంధించి ఆ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ వద్ద సీబీఐ విచారణ చేపట్టనుంది. ఆమె పదవిలో ఉండగా అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులకు సంబంధించి అయిదు కేసుల్లో ప్రాథమిక విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
 
ముఖ్యంగా గనుల తవ్వకాలకు ఇచ్చిన అనుమతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని భావిస్తున్న సీబీఐ అతి త్వరలో ఆమెను ప్రశ్నించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జయంతి నటరాజన్ రాజీనామా చేసిన తర్వాత సీబీఐ ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 
 
దీనిపై సీబీఐ వర్గాలు స్పందిస్తూ.. తాము ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు ఇచ్చిన అనుమతులను పరిశీలించామని, వాటి పత్రాలను సేకరించామని పేర్కొంటున్నాయి. ఆమె తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందన్న విషయాన్ని తొలుత విచారించాలన్నది సీబీఐ అభిమతంగా తెలుస్తోంది.