శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (15:31 IST)

జార్ఖండ్‌లో దారుణం : టీచర్‌ను హత్య చేసిన ఏడో తరగతి విద్యార్థులు!

జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏడో తరగతి చదివే ముగ్గురు విద్యార్థులు కలిసి తమకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్‌ను కొట్టి చంపి... అతని వద్ద ఉన్న నగలు, నగదు దోచుకున్నారు. ఈ దారుణం జార్ఖండ్‌ రాష్ట్రంలోని పశ్చిమ సింఘ్ భమ్ జిల్లాలో చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... తుంగ్రి మొహల్లా ప్రాంతంలోని సెయింట్ జేవియర్ బాలుర పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ఈ హంతక విద్యార్థులు అనేక రకాలైన వ్యసనాలకు బానిసలయ్యారు. ఈ విషయం తెలిసిన సదరు టీచర్ జాస్లిన్ టొప్నో పలుమార్లు హెచ్చరించాడు. ఈ ముగ్గురిలో ఓ విద్యార్థి టొప్నో ఉండే భవనంలోనే ఓ అద్దె గదిలో ఉంటున్నాడు. మిగతా ఇద్దరూ తరచూ ఆ గదికి వచ్చేవారు. తమను హెచ్చరిస్తున్న ఆ ఉపాధ్యాయుడిని చంపి, అతడి వద్ద ఉన్న నగదుతో బైక్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ వేశారు. 
 
ఇందుకోసం తన మిత్రుడి వద్ద ఉన్న తుపాకీని ఇవ్వాలని కోరగా, అతను నిరాకరించాడు. దీంతో గొడ్డలితో చంపాలని నిశ్చయించుకున్నారా ముగ్గురు మిత్రులు. టీచర్ గదిలోకి ప్రవేశించి అతడిపై గొడ్డలితో దాడి చేశారు. అక్కడే ఉన్న మరో విద్యార్థిని కూడా చంపేందుకు ఈ త్రయం ప్రయత్నించింది. అయితే, ఆ బాలుడు తప్పించుకుని స్థానికులకు సమాచారం అందించాడు. దీంతో, ఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అప్పటికే నిందితుల్లో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని నిందితుల్లో ఒకరిని పట్టుకుని, తమదైన శైలిలో విచారించగా, మిగతా ఇద్దరి ఆచూకీ బయటపడింది. అనంతరం వారిని కూడా అరెస్టు చేశారు. కాగా, వారు తుపాకీ అడిగిన మిత్రుడి ఇంటిపై పోలీసులు దాడి చేయగా, అక్కడ వారికి రెండు దేశవాళీ పిస్టళ్లు, ఒక ఎయిర్ గన్, రెండు లైవ్ కార్ట్రిడ్జ్‌లు లభ్యమయ్యాయి. దీంతో, ఆ బాలుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.