గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (12:16 IST)

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎల్.దత్తు ప్రమాణ స్వీకారం!

భారతదేశ సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎల్. దత్తు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. 14 నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగే 63 సంవత్సరాల దత్తు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికంటే సీనియర్. ఈయన 2015 డిసెంబర్ 2వ తేదీ వరకు సీజేగా కొనసాగుతారు. 
 
కాగా, ఆదివారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ఓ స్వల్ప కార్యక్రమంలో దత్తు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ స్వల్ప కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ టి.జె.కురియన్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, రవిశంకర్ ప్రసాద్, వెంకయ్య నాయుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ, విపక్ష పార్టీ తరపున కాంగ్రెస్ నేతలు అభిషేక్ సింఘ్వీ, రాజీవ్ శుక్లాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
ప్రస్తుతం 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు బెంచ్‌కి దత్తు సారథ్యం వహిస్తున్నారు. 2008 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దత్తు బాధ్యతలు చేపట్టారు. 1975లో అడ్వకేట్‌గా జీవితాన్ని బెంగళూరులో మొదలుపెట్టిన ఆయన సివిల్, క్రిమినల్, టాక్స్, రాజ్యాంగపరమైన అనేక కేసులను వాదించారు. 2007లో చత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం అదే హోదాలో కర్ణాటకకు బదిలీ అయ్యారు. ఈ ఏడాదిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి దత్తు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే లోధా ఈ బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.