మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (15:54 IST)

దేశ వ్యాప్తంగా 120 ఆర్‌ఎస్‌ఎస్ ''కామధేను నగర్''లు...!

హిందూ సంప్రదాయాల పరిరక్షణకై పాటుపడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కొత్త నినాదాన్ని చేపట్టింది. హిందుత్వంలో అతి పవిత్రంగా భావించే గోవుల సంరక్షణ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. గోవుల కోసం దేశవ్యాప్తంగా 'కామధేను నగర్' పేరిట 120 ప్రత్యేక ఆవాసాలు నిర్మించేందుకు పూనుకుంది. అయితే జనావాసాలకు అనుబంధంగానే ఈ ''కామధేను నగర్''లను ఏర్పాటుచేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. 
 
అంతేకాకుండా కామధేను నగర్‌లకు అనుబంధంగా 80 'గోకుల్ గురుకుల్' పాఠశాలలు కూడా నడపాలని యోచిస్తోంది. దీని గురించి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ గో సేవ అధ్యక్షుడు శంకర్ లాల్ మాట్లాడుతూ.. దేవుడు ప్రసాదించిన మానవ జీవితంలో గోవు కూడా ఓ భాగం అయినప్పుడే దాన్ని రక్షించగలమని తెలిపారు. 
 
అందు కోసమే జనావాసాలలో కామధేను నగర్‌లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ విషయమై గేటెడ్ కమ్యూనిటీ, కాలనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఈ గోశాలల ద్వారా పాలు, పాల పదార్థాలు, ఔషధాలు, గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి ఆయా కాలనీలకు అందిస్తామని, ప్రతిగా, కాలనీలు కామధేను నగర్ బాధ్యతల్లో సాయపడతాయని ఆయన వివరించారు. 
 
ఇందుకోసం ఇప్పటికే పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 100కు పైగా అనువైన స్థలాలను గుర్తించామన్నారు. ఇక, ఆవు పాలు తాగడం ద్వారా మనుషుల్లో సాత్వికత పెంపొందుతుందని, తద్వారా క్రైమ్ రేటు తగ్గుతుందని శంకర్ లాల్ పేర్కొన్నారు. నేర రహిత భారత్ కోసం పిల్లలు భారత గోవుల పాలు మాత్రమే తాగాలని ఆయన పిలుపునిచ్చారు.