గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (17:46 IST)

కర్ణాటకలో రేప్ వ్యాఖ్యల దుమారం... హోంమంత్రి జార్జి క్షమాపణలు...

కర్ణాటకలో రేప్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఒక యువతిని ఇద్దరు చేస్తే రేప్ కాదనీ.. నలుగురు చేస్తేనే అది అత్యాచారం అవుతుందంటూ ఆ రాష్ట్ర హోం మంత్రి కేజే జార్జి చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన నోటి దురుసుతనం కారణంగా "ఐ యాం వెరీ సారీ" అంటూ సెలవిచ్చారు. 
 
ఒక యువతిని ఇద్దరు మగాళ్లు కలిసి చేస్తే అది గ్యాంగ్ రేప్ ఎలా అవుతుందంటూ ఈయనగారు ప్రశ్నించారు. కనీసం నలుగురైదుగురు కలిసి చేస్తేనే దాన్ని గ్యాంగ్ రేప్ అనాలేగానీ, ఇద్దరు చేస్తే అది ఎలా అవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఐటీ నగరం బెంగుళూరులో ఇటీవల 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిని ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి కదులుతున్న వ్యానులో మూడు గంటల పాటు సిటీలో తిప్పుతూ అత్యాచారం చేసిన విషయంతెల్సిందే. దీనిపై ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఆయన పైవిధంగా స్పందించారు. 
 
మధ్యప్రదేశ్కు చెందిన ఆ యువతి డ్యూటీ ముగిసిన తర్వాత తన పీజీ హోంకు వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా వాళ్లు వచ్చి ఆమెను వ్యానులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లి, అత్యాచారం చేశారు. అయితే ఇంతటి దారుణమైన ఘటన విషయంలో రాష్ట్ర హోంమంత్రి స్పందించిన తీరుపట్ల జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా వ్యాఖ్యలుచేయడం సరికాదని హితవు పలికారు. ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు మాట్లాడేముందు ఏం చెబుతున్నామో ఓసారి ఆలోచించుకోవాలన్నారు. అలాగే, విపక్ష పార్టీలు సైతం మంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. ఫలితంగా ఆయన వెనక్కి తగ్గి ఐ యాం వెరీ సారీ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.