గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (08:01 IST)

ప్రథమ పౌరుడికి కేసీఆర్ పాదాభివందనం

దేశ ప్రథమపౌరుడు, రాష్ట్రపతి అయిన ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకున్నారు. కేసీఆర్ విమానశ్రయంలో ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. పది రోజుల విశ్రాంతి కోసం ప్రత్యేకంగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన బోయింగ్‌ బిజినెస్‌ జెట్‌ (బీబీజే)లో సోమవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రణబ్ హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సాదరంగా స్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా విమానం దగ్గరకే వెళ్లారు. అక్కడే కేసీఆర్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పాదాభివందనం చేశారు. వినమ్రంగా రాష్ట్రపతి కాళ్లకు మొక్కారు. చిరు దరహాసంతో రాష్ట్రపతి ఆయనను దీవించారు. 
 
అక్కడి నుంచి ప్రత్యేక టెంటు వరకు రాష్ట్రపతిని కేసీఆర్‌ తోడ్కొని వచ్చారు. గవర్నర్‌ నరసింహన్‌ కూడా వారి వెంట ఉన్నారు. అనంతరం స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, సీఎస్‌ రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మలతోపాటు ఎంపీ కవిత, మంత్రులను ప్రణబ్‌కు సీఎం కేసీఆర్‌ పరిచయం చేశారు. రాష్ట్రపతి ఒక్క నిమిషంపాటు తెలంగాణ ప్రజా ప్రతినిధులతో గడిపారు. మొత్తంమీద ఐదు నిమిషాలపాటు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లో ఉన్న రాష్ట్రపతి అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకొని విశ్రాంతికి ఉపక్రమించారు.