శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 ఏప్రియల్ 2016 (11:43 IST)

కేరళలోని పుట్టంగల్ ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రధాని దిగ్భ్రాంతి.. 300మందికి గాయాలు

కేరళలోని పుట్టింగల్‌ ఆలయంలో అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ వెళ్లి బాధితులను పరామర్శించనున్నట్లు ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను ప్రధాని ఆదేశించారు. కాగా, కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 102 మంది మృతి చెందగా.. దాదాపు 300 మందికి పైగా గాయపడ్డారు.
 
ఆలయ వేడుకల్లో భాగంగా కొందరు భక్తులు బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. క్షతగాత్రులను త్రివేండ్రం వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయంలో ఎక్కువ భాగం చెక్కతో నిర్మించి ఉండటం, ప్రమాదం జరిగిన సమయంలోనే ఎక్కువ మంది ఒకేచోట ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. 
 
‘మీనాభరణి’ వేడుకల సందర్భంగా ప్రమాదం పుట్టింగల్‌దేవి ఆలయంలో మలయాళ నెలల ప్రకారం భరణి నక్షత్రంలో మీనాభరణి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున బాణసంచా కాల్చడం ఆనవాయితీ. వీటితో పాటు అశ్వితి విలక్కు, కథాకళి, కంపడికాలి, మరమేడప్పు తదితర ఉత్సవాలను సైతం భారీగా నిర్వహిస్తారు. మీనాభరణి ఉత్సవం సందర్భంగా కొందరు భక్తులు బాణసంచా కాల్చడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.