బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (15:35 IST)

మద్యం మరింత కాస్ట్లీ... ఇక ఫైవ్ స్టార్ హోటళ్లలోనే లభ్యం

కేరళలో ఉమన్‌చాందీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నిషేధ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 418 బార్లను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మలి విడతగా హోటళ్లలో నిర్వహిస్తూ వచ్చిన 300 బార్లను మూసివేసేందుకు నోటీసులు జారీ చేసింది.
 
దీనికి బార్ల యజమానులు వ్యతిరేకత తెలిపారు. సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసుకున్నారు. కేసును విచారించిన సుప్రీం కోర్టు అక్టోబర్ 30వ తేది లోపు హోటళ్లలో నిర్వహించే బార్లు మూసివేయాలనే ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా 30వ తేది లోపు బార్ల యజమానులు పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని పేర్కొంది. 
 
ఆ ప్రకారం ఈ కేసు గురువారం కేరళ హైకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయమూర్తి సురేంద్రమోహన్ కేసును విచారించి కేరళలో ఉన్న 5, 4 స్టార్ హోటళ్లు, హెరిటేజ్ బార్లు మాత్రమే తెరచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ, మరో 250 బార్లను మూసివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.
 
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేరెక్కడ మద్యం బార్లు కనిపించని స్థితి ఏర్పడింది. కనుక ఇక కేరళలో ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉన్న 21 బార్లు, ఫోర్ట్ స్టార్ హోటళ్లలో ఉన్న 33, హెరిటేజ్ బార్లు 8 అంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 62 బార్లు మాత్రమే నడుస్తాయి.