శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (16:04 IST)

నా రక్తం కాంగ్రెస్‌ పార్టీది.. అందుకే తిరిగి చేరా .. నటి ఖుష్బూ

కాంగ్రెస్ పార్టీలో తాను చేరడానికి గల కారణాలను సినీ నటి ఖుష్బూ వివరించారు. తన రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకొచ్చారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పిన ఆమె.. ఇక్కడకు రావడం పుట్టింటింటికి వచ్చినంత సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. డీఎంకే కోశాధికారి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. డీఎంకే నుంచి వైదొలగి కొన్ని రోజులుగా ఇంట్లో ఉన్న ఆమె.. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే. 
 
డీఎంకేను గానీ లేదా ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్‌ను ఢీకొట్టేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీపై తనకు అపారమైన నమ్మకం ఉందన్నారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీని చాలా మంది నేతలు వీడుతుంటే తాను ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు. 
 
కుల, మతభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమ న్యాయం చేయగల ఏకైక లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని అందువల్లే ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు. పైగా ముంబైలో పుట్టి పెరగడం వల్ల తాను చిన్న వయస్సు నుంచే కాంగ్రెస్ పార్టీపై మంచి అభిమానం ఉందన్నారు. ఒక విధంగా చెప్పాలంటే నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. అదేసమయంలో తాను పదవులకు ఆశపడి పార్టీలో చేరలేదన్నారు. 
 
డీఎంకేలో ఉన్న సమయంలో నాలుగేళ్ళ పాటు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానని, పదవి కావాలంటే ఆ పార్టీలోనే అడిగి తీసుకుని ఉండేదాన్నన్నారు. కానీ, తనకు పదవుల కంటే పార్టీయే గొప్పదన్నారు. అయితే, తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.