మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (13:51 IST)

మమతా... చిదంబరాన్ని చూసి నేర్చుకోండి : తస్లీమా నస్రీన్

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ చురకలంటించారు. ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ రచించిన సతానిక్ వెర్సెస్ అనే పుస్తకాన్ని మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నిషేధించడం తప్పేనంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి  చిదంబరం వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చురకలంటించారు. చిదంబరాన్ని చూసైనా నేర్చుకోవాలని దీదీకి హితవు పలికారు. తాను రచించిన ఓ కథ ఆధారంగా నడుస్తున్న టీవీ సీరియల్‌‌ తమ మనోభావాలకు విరుద్ధంగా ఉందంటూ ముస్లిం సంస్థలు అభ్యంతరం తెలుపడంతో ఆ సీరియల్‌ ప్రసారంపై మమత ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
దీన్ని తస్లిమా నస్రీన్ ఖండించారు. చిదంబరాన్ని చూసైనా సీరియల్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని తస్లీమా కోరారు. తస్లీమా రచించిన 'ద్విఖండితో' పుస్తకాన్ని బుద్ధదేవ్ భట్టాచార్య  ప్రభుత్వం నిషేధించింది. దీనిపై కూడా తస్లీమా స్పందిస్తూ... చిదంబరం మాదిరిగా బుద్ధదేవ్ భట్టాచార్య కూడా తన తప్పును ఎప్పుడు అంగీకరిస్తారో వేచి చూడాల్సి వుందన్నారు.