గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (14:54 IST)

రాందేవ్ ఔషధాల్లో పశువుల ఎముకలు కలిపి అమ్ముతున్నారు: లాలూ

యోగా గురువు బాబా రాందేవ్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాటల తూటాలు పేల్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్న బాబా రాందేవ్ ఆర్ఎస్ఎస్ కంటే ప్రమాదకరమని విమర్శించారు. రాందేవ్ ఆర్ఎస్ఎస్‌ను మించి కరుడుగట్టిన హిందుత్వవాది అని లాలూ వ్యాఖ్యానించారు. ఆయన అమ్మే ఔషధాల్లో పశువుల ఎముకలు కలిపి అమ్ముతున్నారని సీపీఎం నేత బృందా కారత్ అన్న విషయాన్ని లాలూ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
 
అలాంటప్పుడు పశువుల ఎముకలైనా, మనిషి ఎముకలైనా తేడా ఏముందని లాలూ ప్రసాద్ ప్రశ్నించారు. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. నల్లధనం విషయంలో రాందేవ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాబా సాధువు కాదని, సొంత పనులు చక్కబెట్టుకునే వ్యక్తని విమర్శించారు. రాందేవ్ అమ్ముతున్న మందుల వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని లాలూ డిమాండ్ చేశారు. 
 
కాగా బీహార్ ఎన్నికలు బీఫ్ చుట్టే తిరుగుతున్న సంగతి తెలిసిందే. నిషేధిత మాంసాహారాన్ని తిన్నాడని ఓ ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని లాలూ, నితీష్ కుమార్‌లు కంకణం కట్టుకున్నారు. ప్రచారంలో భాగంగానే బీజేపీని లాలూ, నితీష్‌ పార్టీలు ఎండగడుతున్నాయి.