శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (14:21 IST)

పార్లమెంట్‌లో జశోదాబెన్ పేరు ప్రస్తావన.. మైక్ కట్ చేసిన డిప్యూటీ ఛైర్మన్!

తనకు ఏ హోదాలో భద్రత కల్పిస్తున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ ఆర్టీఐలో దాఖలు చేసిన పిటీషన్‌పై బుధవారం పార్లమెంట్‌ రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ ఈ అంశాన్ని సభ ముందుకు తెచ్చారు. 
 
ఈ విషయంపై మిస్త్రీ మాట్లాడబోగా ఛైర్ అనుమతిని నిరాకరించింది. జశోదాబెన్ పేరు ఎత్తగానే దీనిపై మాట్లాడేందుకు అనుమతించబోనని డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ స్పష్టం చేశారు. కాగా, ప్రధాని భార్యగా తనకు కల్పిస్తున్న భద్రతపై వివరాలు ఇవ్వాలని జశోదాబెన్ ఆర్టీఐకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.
 
కాగా, తనకు కల్పిస్తున్న వ్యక్తిగత భద్రతపై తనకు వివరణ ఇవ్వాలని ఆర్టీఐలో జశోదాబెన్ ఒక పిటీషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. తనకు ఓ హోదాలో భద్రత కల్పిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పైగా... ఓ ప్రధానమంత్రి భార్యగా తనకున్న హక్కులేంటో వెల్లడించాలని అందులో కోరింది. తనకు కల్పిస్తున్న భద్రత వివరాలను తనకు లిఖిత పూర్వకంగా తెలుపాలని కోరారు. 
 
పైగా... తాను ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన బస్సుల్లో ప్రయాణిస్తుంటే.. తనకు కల్పించిన భద్రత మాత్రం ప్రత్యేక వాహనాల్లో తన వెంట రావడాన్ని ఆమె ప్రశ్నించారు. అసలు తనకు ఏ హోదాలో భద్రత కల్పిస్తున్నారని ఆమె నిలదీశారు. ఇదే అంశంపై తనకు సమాధానమివ్వాలని కోరారు. భద్రతతో పాటు ప్రధాని భార్యగా ప్రొటోకాల్ ప్రకారం తనకు లభించే హక్కులేమిటో కూడా తెలియజేయాలని కోరారు. 
 
అంతేకాకుండా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె గార్డులే.. పైగా ఆమె ప్రధానిగా ఉన్న సమయంలోనే కాల్చి చంపారని జశోదా బెన్ గుర్తు చేశారు. తన గార్డుల పట్ల కూడా భయాందోళనలు వ్యక్తం చేశారు. తన భద్రత కోసం నియోగించే గార్డుల నియామక పత్రాన్ని తనకు సమర్పించడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. 
 
జశోదా బెన్‌ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన విషయాన్ని మెహసానా ఎస్పీ జేఆర్‌ మొథాలియా ధ్రువీకరించారు. దీనిపై మొథాలియా స్పందిస్తూ.. జశోదా బెన్ సోమవారం తమ కార్యాలయానికి వచ్చి ఈ పిటిషన్ ఇచ్చారని, నిర్ణీత కాల వ్యవధిలోనే దానికి సమాధానం ఇస్తామని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత జశోదా బెన్‌కు సాయుధ దళాలు సహా మొత్తం 10 మంది పోలీసుల రక్షణ కల్పిస్తున్నామని, షిఫ్టుల వారీగా వీరు విధులను నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం తనకు కల్పిస్తున్న భద్రతకు సంబంధించిన అన్ని పత్రాలనూ జశోదా బెన్ కోరారు. ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన అసలు ఉత్తర్వు కాపీ కూడా కావాలన్నారు.