శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (15:25 IST)

మహారాష్ట్ర ప్రతిష్టంభన: గడ్కరీతో దేవేంద్ర ఫడ్నవిస్ భేటీ!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌లో గురువారం సమావేశమయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ నాగ్‌పూర్‌లోని గడ్కరీ నివాసానికి వెళ్లి ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి భేటీ సుమారు అర్థ పాటు కొనసాగింది. ఈ సమావేశం మర్యాదపూర్వకమైనదని పార్టీ వర్గాలు తెలిపాయి.
 
అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్‌, నితిన్‌ గడ్కరీ పోటీ పడుతున్న విషయం తెల్సిందే. పైకి మాత్రం మహారాష్ట్ర సీఎం కుర్చీపై తనకు ఆశలేదంటున్న నితిన్ గడ్కరీ తెరవెనుక తన ప్రయత్నాలు మాత్రం విరమించుకోలేదు. 
 
మరోవైపు.. బీజేపీ అధిష్టానం దేవేంద్ర ఫడ్నవిస్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ ఆ విషయాన్ని మాత్ర అధికారపూర్వకంగా వెల్లడించలేదు. దీనికి కారణం మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రావడం వెనుక నితిన్ గడ్కరీ కృషిని విస్మరించలేమన్నది ఆ పార్టీ నేతల వాదన. దీంతో సీఎంగా ఎవరు ఉంటారో.. ఉండాలో గడ్కరీ, ఫడ్నవిస్‌లను తేల్చుకునే అవకాశాన్ని కల్పించినట్టు సమాచారం. 
 
ఇందులోభాగంగా వారిద్దరు గురువారం దీపావళి శుభాకాంక్షల పేరుతో సమావేశమయ్యారు. పైగా వీరిద్దరూ నాగ్‌పూర్‌ నగరానికి చెందినవారే. దీంతో వారిద్దరు మనస్సు విప్పి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే, పైకి మాత్రం తమ భేటీ మర్యాదపూర్వకమైనదేనంటూ మీడియాకు వెల్లడించారు.