గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 26 మే 2015 (15:47 IST)

హెల్మెట్ లేకుండా కారు నడిపాడట.. ఫైన్ చలానా రాసిన ట్రాఫిక్ కానిస్టేబుల్!

హెల్మెట్ లేకుండా కారు నడిపాడంటూ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ చాలానా రాశాడు. వినడానికి కాస్తంత ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హెల్మెట్ లేకుండా కారు నడుపుతున్నాడంటూ మీరట్‌లో ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు చలానా రాశారు. ఆ చలానాపై వ్యక్తికి చెందిన మారుతి స్విఫ్ట్ కారు రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కూడా వేశారు. 
 
ఆదివారం సాయంత్రం నగరంలోని హసన్ పూర్ ప్రాంతంలో శైలేందర్ సింగ్ (43) అనే వ్యక్తి కారులో వెళుతుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ పోలీసాఫీసర్ కారు పేపర్లు అడగ్గా, సింగ్ అన్నీ చూపించారు. అయినాగానీ, అతడిని వదిలేసేందుకు ట్రాఫిక్ వారు అంగీకరించలేదు. తన నాలుగు నెలల కొడుకును వైద్యుడి వద్దకు తీసుకెళ్లాల్సి ఉందని, ఇప్పటికే ఆలస్యం అయిందని, కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం తనను వెళ్లేందుకు అనుమతించలేదని సింగ్ అసహననానికి లోనయ్యారు. దీంతో, అక్కడ వాడీవేడి వాదన జరిగింది.
 
ఇంతలో, సింగ్‌కు ఆశ్చర్యం కలిగేలా, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నాడంటూ చలానా రాశారు. అసలు, కారులో హెల్మెట్ పెట్టుకోవడం తానెప్పుడూ వినలేదని ఆయన విస్తుపోయారు. దీనిపై సింగ్ సోమవారం ఎస్ఎస్‌పీ డీసీ దూబేను కలిసి వివరించారు. దీంతో, ఆ అధికారి ట్రాఫిక్ ఎస్పీని విషయమేంటో కనుక్కోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు తప్పు చేసినట్టు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు, ట్రాఫిక్ పోలీసులు మాత్రం, హెల్మెట్ లేకుండా కారు నడుపుతున్నట్టు పొరబాటున చలానా రాశామని, అది సాంకేతిక తప్పిదమని వివరణ ఇచ్చారు.