శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (17:40 IST)

మణిపూర్‌లో అల్లర్లు.. మంత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురి మృతి

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల కారణంగా చెలరేగిన హింస వల్ల ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది వరకు గాయపడ్డారు. అలాగే, ఆందోళనకారులు ఓ మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ మూడు వివాదాస్పద బిల్లులకు ఆమోదం తెలిపింది. వీటిని వ్యతిరేకిస్తూ కొందరు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆ రాష్ట్రంలో బయటివారి రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు పర్మిట్ విధానం (ఇన్నర్ లైన్ పర్మిట్) ప్రవేశపెట్టడం, రాష్ట్రంలో భూసంస్కరణలు తదితర అంశాలకు చెందిన బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. 
 
దీనికి నిరసన వ్యక్తం చేస్తూ, అక్కడి చురచంద్‌పూర్ పట్టణంలో పలువురు చేసిన ఆందోళనలో ముగ్గురు మరణించడం, ఎనిమిది మందికి గాయాలవడంతో ఆ పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. బిల్లు పాస్ అవడానికి సహకరించిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, మరో ఐదుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దాంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు చనిపోగా, మరొకరు ఒంటికి నిప్పు అంటుకుని మరణించారు. దీంతో మణిపూర్ హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. దీంతో హింసాత్మక చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు.