గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2014 (18:25 IST)

కన్నడ మాట్లాడలేదని మణిపూర్ విద్యార్థిని చావబాదారు!

కన్నడ భాష మాట్లాడలేదని మణిపూర్ విద్యార్థిని చావబాదిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో బుధవారం వెలుగు చూసింది. ఈ దాడిలో అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్రేతర విద్యార్థులు ఎక్కువగా నివసించే కర్ణాటకలోని కోతనూర్‌లో మంగళవారం రాత్రి ఆ ఘటన చోటు చేసుకోగా, బుధవారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ దాడిలో మణిపురి గిరిజన తెగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు టి. మైఖేల్ లామ్జాతంగ్ వోకివ్ తల, వీపులపై గాయాలయ్యాయి. అయితే మైఖేల్ ఆరోగ్య పరిస్థితిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. ఈ ఘటనలో మైఖేల్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు కూడా స్వల్పంగా గాయపడ్డారు. కన్నడ భాషలో మాట్లాడాలని బలవంతం చేశారని, రాష్ట్రేతరులుగా కర్ణాటకలో పండించిన ఆహారాన్ని తినడం నేర్చుకున్న మీరు కన్నడ భాషలో మాట్లాడాలని, ఇది చైనా కాదని, భారతదేశం అంటూ తమపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
మైఖేల్ మంగళవారం రాత్రి మిత్రులతో కలిసి డిన్నర్‌కు రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో దాడి జరిగింది. ఆహారం కోసం ఎదురు చూస్తూ మైఖైల్ బృందం ఇంగ్లీషులో మాట్లాడుకుంటోంది. పక్క బల్లపై కూర్చున్నవారు వారి ఇంగ్లీష్ సంభాషణకు అభ్యంతరం చెప్పారు. జాతి వివక్షతోనే తమపై దాడి చేశారని మైఖేల్ ఆరోపంచాడు. స్థానిక యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) ఆలోక్ కుమార్ వెల్లడించారు.