బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (16:05 IST)

మార్కండేయ కట్జూ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు!

రిటైర్డ్ జడ్జి మార్కండేయ కట్జూ వ్యాఖ్యలపై మంగళవారం ఒక పిటీషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. న్యాయ వ్యవస్థలో అవినీతిపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయవాదులు రాజారామన్, సతీశ్ గల్లా దాఖలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాసు హైకోర్టుకు చెందిన అదనపు న్యాయమూర్తికి పొడగింపు ఇచ్చే విషయంలో ముగ్గురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రాజీపడ్డారని కట్జూ ఆరోపించిన విషయం విదితమే. 
 
గత యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులుగా ఉన్న ఆర్.సి. లహోటి, వైకే సబర్వాల్, కేజీ బాలకృష్ణన్ రాజకీయ ఒత్తిడికి తలొగ్గి అసంబద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. కట్జూ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. ఉభయ సభల్లో ఇదే అంశంపై జరిగిన స్వల్పస్థాయి చర్చలో కూడా కట్జూ వ్యాఖ్యలను ప్రభుత్వం కూడా సమర్థించింది.