గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 జులై 2018 (08:59 IST)

మోక్షం కోసమనీ.. ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి

ఢిల్లీలో దారుణం జరిగింది. మోక్షం కోసం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇదే అభిప్రాయాన్ని పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు. అంతేనా, ఇటీవల నిశ్చి

ఢిల్లీలో దారుణం జరిగింది. మోక్షం కోసం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇదే అభిప్రాయాన్ని పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు. అంతేనా, ఇటీవల నిశ్చితార్థం జరిగిన ఓ యువతి కూడా ఉంది. ఈ ఘటనతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారి ఉలిక్కిపడింది. రాత్రి దాకా అందరితో నవ్వుతూ మాట్లాడిన వారు తెల్లవారేసరికి అలా నిర్జీవులై కనిపించారు. ఒకే కుటుంబానికి 11 మందిలో 10 మంది ఒకే గదిలో ఉరితాళ్ళకు వేడుతుంటే.. మరో గదిలో గొంతుకోసి చంపేసిన వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌కు చెందిన నారాయణ్‌ దేవి (75), ప్రతిభ (60) ఇరవై రెండేళ్ల క్రితం ఉత్తర ఢిల్లీ బురారీ ప్రాంతంలో ఉన్న సంత్‌నగర్‌కువచ్చి స్థిరపడ్డారు. వీరు ఓ కిరాణా షాపు నడుపుతూ ప్లేవుడ్ వ్యాపారం కూడా చేస్తున్నారు. నారాయణ్‌ దేవికి.. పెద్ద కుమారుడు భవనేశ్‌ భాటియా (46), కోడలు సవిత (42), మనవలు నీతు (24), మీను (22), ధీరు (12), చిన్న కుమారుడు లలిత్‌ భాటియా (42), చిన్న కోడలు టీనా (38), వారి కుమారుడు శివమ్‌ (15) ఉన్నారు. ఇక, ప్రతిభా దేవికి ప్రియాంక (33) అనే కుమార్తె ఉన్నది. వీరంతా ఒకే ఇంట్లోనే ఉమ్మడిగానే నివసిస్తున్నారు. 
 
ఇంటి కింది భాగంలో కిరాణా దుకాణం ఉండగా.. మొదటి అంతస్తులో వీరు నివాసం ఉంటున్నారు. రోజూలాగానే శనివారం రాత్రి 11.45 గంటలకు కిరాణా దుకాణాన్ని మూసేసి పైకి వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటలకు దుకాణం తెరవాల్సి ఉండగా తెరవలేదు. ఉదయం 7.30 గంటలు అవుతున్నా షాపు తెరవకపోవడంతో.. పాల కోసం వచ్చిన పొరుగింటి వ్యక్తి పైకి వెళ్లి చూశాడు! చూసేసరికి.. ఇంటిల్లిపాదీ శవాలై కనిపించారు. వెంటనే అతడు కిందికి వచ్చి చుట్టుపక్కలవారికి చెప్పాడు. అందరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వీరంతా మోక్షం కోసం ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్థి స్థాయిలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.