బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (12:47 IST)

జడ్జీల వైద్యఖర్చుల వివరాలు వెల్లడించడం కుదరదు : సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు.. వారి కుటుంబసభ్యుల వివరాలను బహిర్గతం చేయడం సాధ్యపడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈరోజు అతడు (పిటిషన్‌దారు) వైద్యఖర్చుల సమాచారం అడిగారు. రేపు న్యాయమూర్తులు వాడిన ఔషధాలేమిటని అడుగొచ్చు. అవి బహిర్గతం చేస్తే న్యాయమూర్తులు ఏ వ్యాధులతో బాధపడుతున్నారన్న విషయం తెలిసిపోతుంది. ఇలా మొదలయ్యేదానికి అంతమెక్కడ? అని ధర్మాసనం ప్రశ్నించింది. 
 
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మెడికల్ బిల్లుల వివరాలను వెల్లడించాలని ఆర్టీఐ కార్యకర్త సుభాశ్‌చంద్ర అగర్వాల్ కేంద్ర సమాచార కమిషన్‌ను కోరారు. దీనికి కమిషన్ నో చెప్పడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఈ పిటీషన్‌ను హైకోర్టు ఏకసభ్య ధర్మాసనానం కొట్టివేసింది. ఆ తర్వాత పిటీషన్‌దారుడు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేశాడు. ఏప్రిల్ 17న డివిజన్‌బెంచ్ కూడా అదేరకమైన తీర్పివ్వటంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
పిటిషనర్ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది ప్రశాంత్‌భూషణ్.. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల వివరాలు వెల్లడించే వ్యవహారంలో అనుకూల తీర్పులిచ్చిన న్యాయస్థానం, సొంత వివరాలు ఎందుకు దాయాలని చూస్తున్నాయని ప్రశ్నించారు. ఆయన వాదనతో విభేదించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, న్యాయమూర్తులు అరుణ్‌మిశ్రా, అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం.. న్యాయమూర్తుల విధుల దృష్ట్యా వివరాలు వెల్లడించటం సాధ్యంకాదని స్పష్టంచేసింది. న్యాయమూర్తుల వ్యక్తిగత రహస్యాలను గౌరవించాల్సిందే. స్వయంగా వివరాలు వెల్లడిస్తే మాత్రం ఆపాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది.