శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 మే 2017 (11:02 IST)

తమిళ మంత్రులకు రూ.400 కోట్ల లంచం.. ఐటీ దర్యాప్తులో గుట్టువిప్పిన శేఖర్ రెడ్డి...

తమిళనాడు మంత్రులకు రూ.400 కోట్ల మేరకు లంచాలు ఇచ్చినట్టు తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్ జే.శేఖర్ రెడ్డి వెల్లడించాడు. ఐటీ అధికారులు జరిపిన తనిఖీల్లో ఆయన ఈ విషయాలు బహిర్గతం చేశాడు.

తమిళనాడు మంత్రులకు రూ.400 కోట్ల మేరకు లంచాలు ఇచ్చినట్టు తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్ జే.శేఖర్ రెడ్డి వెల్లడించాడు. ఐటీ అధికారులు జరిపిన తనిఖీల్లో ఆయన ఈ విషయాలు బహిర్గతం చేశాడు. పైగా.. ఈ ముడుపులు ఇచ్చినందుకు పక్కా ఆధారాలను కూడా ఐటీ శాఖ అధికారులు సేకరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ ఒక నివేదిక ఇచ్చి.. దానిపై చర్య తీసుకోవాలని కోరినట్టు సమాచారం. 
 
తమిళనాడు రాష్ట్రంలో బడా ఇసుక కాంట్రాక్టర్‌గా పేరుగాంచిన శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై గత సంవత్సరం డిసెంబరులో ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేసినప్పుడు రూ.34 కోట్ల కొత్త రెండు వేల రూపాయల నోట్లు సహా రూ.142 కోట్లను రికవరీ చేసిన సంగతి తెలిసిందే. పన్ను ఎగవేత కేసులో సీబీఐ కేసు నమోదు కాగానే ఈ దాడులు జరిగాయి. ఆ తర్వాత ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కేసులు నమోదు చేసింది. 
 
ప్రస్తుతం జైల్లో ఉంటున్న శేఖర్ రెడ్డి వద్ద ఐటీ, ఈడీ అధికారులు జరిపిన విచారణలో అనేక ఆసక్తిక విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా.. తమిళనాడు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులకు రూ.400 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో జైలుకెళ్లిన శేఖర్ రెడ్డికి 87 రోజుల అనంతరం బెయిల్ లభించగా, బయటకు వచ్చిన వెంటనే ఈడీ అధికారులు అరెస్టు చేసి మళ్లీ జైలుకు పంపారు.
 
ఈ నేపథ్యంలో ఐటీ శాఖ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం తర్జనభర్జన చెందుతోంది. ఈ తాజా నివేదిక విషయంలో విచారణకు ఆదేశించాలా? వద్దా? అన్నది ప్రభుత్వ నిర్ణయమని విచారణకు ఆదేశిస్తే, మంత్రులు కటకటాల వెనక్కు వెళ్లాల్సి ఉంటుందని, ఆదేశించకుంటే, చెడ్డ పేరు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్టయితే ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు మనుగడ కొనసాగించలేదని వారు అంటున్నారు.