మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 అక్టోబరు 2014 (18:31 IST)

మంత్రిని సజీవ దహనం చేయబోయిన జనం... రక్షించిన పోలీస్

జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరు ఎదురుగానే బీహార్లో ఓ కేబినెట్ మంత్రిని సజీవంగా దహనం చేయడానికి ప్రజలు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన బీహార్ రాజధాని పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ససారం ప్రాంతంలో చోటుచేసుకుంది. బీహార్ లోని ససారం జిల్లాలో రోహతాస్ ప్రాంతంలో తారా చండి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వినయ్ బిహారీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాట్లు సరిగా లేవంటూ కొందరు స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదికపైకి కుర్చీలను విసిరేయడంతో కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీకి గాయాలయ్యాయి.
 
పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసుల లాఠీచార్జీతో కోపోద్రిక్తులైన స్థానికులు వేదికపై విరుచుకుపడి మంత్రిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు మంత్రి అధికార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చి మంత్రిగారిని కాపాడగలిగారు.