గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (12:28 IST)

దేవేంద్ర ఫడ్నవిస్.. నాడు మోడల్.. రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి!

బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన విదర్భ ప్రాంతానికి చెందిన యువ రాజకీయనేత. ఈ ప్రాంతం నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించనున్న నాలుగో వ్యక్తి. అలాగే, మహారాష్ట్రలో తొలి బీజేపీ ముఖ్యమంత్రి. అయితే, దేవంద్ర ఫడ్నవిస్ జీవితమంతా ఆసక్తికరంగా సాగింది. ఈయన మోడలింగ్‌ కూడా పూర్తి చేసినట్టు ఆయన సన్నిహితులు చెపుతుంటారు. నాగపూర్‌లోని ఓ గార్మెంట్ షాపు ప్రచారం కోసం ఆయన ఎనిమిదేళ్ల క్రితం మోడల్ అవతారమెత్తారు. 
 
తన 19వ యేటనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దేవేంద్ర ఫడ్నివిస్ 44 సంవత్సరాలకే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. సంఘ్ పరివార్‌తో అనుబంధమున్న దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీలో కీలక పాత్ర పోషించారు. న్యాయశాస్త్రంలో పట్టాపొందిన ఫడ్నవిస్ తండ్రి ద్వారా రాజకీయాల్లో ప్రవేశించి 1992 నుంచి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 
 
నాగపూర్ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 21 ఏళ్లకే మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 27వ ఏట నాగపూర్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1989లో నాగపూర్ బీజేపీ విద్యార్థి విభాగంలో ఫడ్నవిస్ కీలక పాత్ర పోషించారు. 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నాగపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. చిన్న వయసులోనే మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికై సరికొత్త రికార్డును సృష్టించారు. ఈయనకు నాగ్‌పూర్‌కే చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మార్గదర్శకుడు.