మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (10:33 IST)

శశికళను సీఎం చేయడానికి కోర్టు తీర్పు అడ్డంకి కాదు : ముకుల్ రోహత్గి

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు న్యాయపరమైన చిక్కులు ఏవీ లేవని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి స్పష్టంచేశారు. ఆమెను సీఎంగా నియమించడానికి గవర్నర్‌కు న్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు న్యాయపరమైన చిక్కులు ఏవీ లేవని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి స్పష్టంచేశారు. ఆమెను సీఎంగా నియమించడానికి గవర్నర్‌కు న్యాయపరంగా ఎలాంటి సలహాలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
నిజానికి పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించి తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భావించారు. ఇందుకు అనుగుణంగానే పావులు కదిపారు. అయితే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 
 
శశికళను సీఎంగా ప్రతిపాదించిన పన్నీరు సెల్వమే ఆమెపైనే సంచలన ఆరోపణలు చేయడంతో జరుగుతున్న పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. శశికళ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని అందరూ భావించారు. అందుకు పార్టీ కార్యకర్తలు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ గవర్నర్ శశికళ ప్రమాణ స్వీకారానికి విముఖత చూపడంతో ఆ తంతు కాస్తా రద్దయింది.
 
శశికళపై ఉన్న అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో గవర్నర్ ఆమెను సీఎంగా నియమించే విషయంలో వెనక్కి తగ్గారు. ఈ విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవాలని గవర్నర్ భావించారు. అయితే ఈ వాదనను అటార్ని జనరల్ ముకుల్ రోహత్గి ఖండించారు. శశికళ సీఎం పదవి చేపట్టడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవని ఆయన చెప్పుకొచ్చారు. ఇపుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.