శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (14:37 IST)

చిరంజీవి 'స్టాలిన్' నినాదం.. నరేంద్ర మోడీ 'స్వచ్ఛ్ భారత్' పిలుపు!

మెగాస్టార్ చిరంజీవి 'స్టాలిన్' చిత్రంలో ఓ నినాదమిచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘మీరు ముగ్గురికి సాయం చేయండి. ఆ ముగ్గురిని, మరో ముగ్గురు చొప్పున సాయం చేయమనండి’’ అని తన చిత్రం ద్వారా చెప్పారు. అయితే, చిరంజీవి చెప్పింది కేవలం సినిమా డైలాగు మాత్రమే. ఆ తర్వాత ఆయనగానీ, ఆయన అభిమానులు గానీ ఆచరించిన దాఖలాలు లేవు. 
 
కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తరహా నినాదం దేశ ప్రజలకు ఇచ్చే ముందు స్వయంగా తాను ఆచరించారు. అదే స్వచ్ఛ్ భారత్ పేరుతో చీపురు చేతపట్టుకుని ఢిల్లీ వాల్మీక్ సదన్ బస్తీని ఊడ్చారు. గురువారం స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రారంభం సందర్భంగా దేశానికి మోడీ ఓ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాన్నదే ఆ పిలుపు సారాంశం. అయితే దానిని ఆయన మన మెగాస్టార్ స్టాలిన్‌లా చెప్పారు. 
 
స్వచ్ఛ్ అభియాన్‌లో భాగంగా రోడ్ల పైకి వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రదాని నరేంద్ర మోడీ ఓ తొమ్మిది మంది పేర్లను చదివారు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీ, ప్రియాంకా చోప్రా, కమల్ హసన్, సల్మాన్ ఖాన్, బాబా రాందేవ్, శశి థరూర్, మృదులా సిన్హా, తారక్ మెహతాలున్నారు. 
 
తన పిలుపుతో ఈ కార్యక్రమంలోకి వచ్చి, తలా మరో తొమ్మిది మందిని పిలవాలన్నది నరేంద్ర మోడీ ఆకాంక్ష. అందుకే వారి పేర్లను ప్రముఖంగా ప్రస్తావించారు. తద్వారా దేశంలోని ప్రతి వ్యక్తి ముందుకు వస్తారని, స్వచ్ఛ్ భారత్ దిగ్విజయమవుతుందన్నది నరేంద్రుడి అభిలాష. సూత్రం బాగానే ఉంది. మరి మోడీ పిలిచిన తొమ్మిది మంది ఎప్పుడు బయటకొస్తారో లేదో చూడాల్సి వుంది.